- న్యూజెర్సీ చాప్తర్ ఆధ్వర్యంలో నిర్వహణ..
- 300 కుటుంబాలకు ఆహారం అందజేత..
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాజ సేవా ఆహార దాన కార్యక్రమం విజయవంతమైంది. సమాజ సేవ, సామాజిక బాధ్యత పట్ల తానాకు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతకు ఈ కార్యక్రమం మరో ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1,800 పౌండ్ల ఆహారాన్ని సేకరించి, న్యూజెర్సీ కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ ద్వారా దాదాపు 300 కుటుంబాలకు నిర్వాహకులు అందజేశారు.
సేకరించిన ఆహారాన్ని ఎడిసన్, న్యూజెర్సీలోని హాండ్స్ ఆఫ్ హోప్ కేంద్రానికి తరలించి, అక్కడ వాలంటీర్లు కలిసి ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాక్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సౌత్ బ్రన్స్విక్‌లోని ఈస్ట్ మీడో ఎస్టేట్స్‌తో పాటు ప్రాంతంలోని పలువురు దాతలు ఉదారంగా సహకరించారు.
ఈ కార్యక్రమంలో చిన్నారుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వంశీ చంద్ర నరేపలుపు, అనిత్ రాంపురం, వర్షా చంద్ర నరేపలుపు ఆహార సేకరణ, ఏర్పాటు పనుల్లో చురుగ్గా పాల్గొని, యువతలో సేవాభావాన్ని పెంపొందించాలనే తానా లక్ష్యాన్ని ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించడంలో సుధీర్ జి. రాంపురం, సుందర్ బి. గోపీనాథ్, ప్రవీణ్ కల్వకొల్లు, దశరథ తలపనేని వంటి తానా వాలంటీర్లు ఎంతో శ్రమించి తమ సేవలను అందించారు.
తానా నాయకత్వ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి తమ మార్గనిర్దేశనం, సహకారం అందించారు. తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి, న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ర నరేపలుపు, ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి ఈ కార్యక్రమంలో పాల్గొని తానా సమాజ సేవా సంకల్పాన్ని మరింత బలపరిచారు.
ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలు తెలియజేస్తూ, న్యూజెర్సీ బృందం చేసిన సేవలను ప్రశంసించారు. అలాగే హ్యాండ్స్ ఆఫ్ హోప్ నిర్వాహకులు చార్లీ, రాజ్, కుష్ కూడా అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినందుకు తానా వాలంటీర్ల కృషిని అభినందించారు.
