Sunday, October 26, 2025
ePaper
Homeసాహిత్యంNagula Chavithi | నాగులచవితి విశిష్టత

Nagula Chavithi | నాగులచవితి విశిష్టత

కార్తీక శుక్ల పక్ష చవితిని నాగులచవితి(Nagula Chavithi) అంటారు. ఇది సర్పపూజకు ఉద్దిష్టమైన రోజు. కార్తీక శుద్ధ చవితి రోజు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతోంది. నాగులు, గరుడులు, వానరులు, రాక్షసులు, అసురులు.. వీరంతా వేర్వేరు జాతుల వారంటారు. అస్సాం దక్షిణ భాగంలోని నాగాయ్ కొండల్లో ఇప్పటికీ నాగజాతి వారున్నారు. నాగులకు, ఆంధ్రులకు ప్రాచీన కాలం నుంచి విశేష సంబంధం ఉంది. భారతావని(India)లో అనేక ప్రదేశాల్లో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆంధ్రులూ (Andhras) నాగ జాతివారనే వాదనా లేకపోలేదు. బౌద్ధ ధర్మమంటే నాగులకు అనురక్తి ఉన్నట్లు, బుద్ధునికి పరమ భక్తులై నాగులు బౌద్ధాన్ని ఆదరించి, అవలంభించారని అనేక గాథలు చెబుతున్నాయి.

దిక్కులను పాలించే లోకపాలకులకు, నాగులకు సంబంధం ఉన్నట్లు బౌద్ధుల విశ్వాసం. అమరావతి(Amaravathi), నాగార్జున కొండ(Nagarjuna Konda)తోపాటు అవిభక్త కరీంనగర్(Karim Nagar) జిల్లాలోని ప్రాచీన ధూళికట్ట తదితర ప్రాంతాల్లో బౌద్ధ శిల్పాల్లో నాగరాజుల, నాగిమల చిత్రాలున్నాయి. భారతావనిలో నాగపూజ (Nagapuja) ఆది నుంచీ ఉంది. గౌతముడు తన గృహ్య సూత్రాల్లో పేర్కొనగా యజ్ఞ మంత్రాల్లో నాగుల స్తుతిని పేర్కొన్నారు. నాగశిలలు, నాగ కల్లులూ, ప్రతిమలు ప్రతి చోటా దర్శనమిస్తాయి. పుట్టిన బిడ్డలు చనిపోతుంటే సంతానం నిలవడానికి నాగ ప్రతిష్ఠలు చేయడం, ఆరాధించడం ఆచారంగా ఉంది. పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి “నీటిని” ప్రసాదించే దేవతలుగా తలచేవారు.

ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా “రైతు”(Farmer)కు పంట నష్టం కలగకుండా చేస్తాయి. ఇలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఆది నుంచీ ఆంధ్రులు నాగారాధకులుగా ఉన్నారు. 5 తలల పాములను వెండితో గానీ, మట్టితో గానీ చేసి పూజించడం ఆచారం. చెవిలో చీము పట్టినా, వినపడక పోయినా, చెవులను బంగారు, వెండితో చేయించి శివాలయాలకు సమర్పించడం పరిపాటి. అనంత, వాసుకి, శేష, పద్మనాభ కంబల, కర్కోటక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళి అనే 12 రకాల సర్పాలను ఒక్కో నెలలో పూజించడం ప్రాచీన సాంప్రదాయం. ప్రపంచంలో శాస్త్రవేత్తలకు తెలిసిన దాదాపు అన్ని రకాల పాములున్న దేశం మనదే.

మానవుడి మానసిక శక్తికి హిందూ దేశంలో పాము చిహ్నం. మానసిక శక్తికి వేదాంత పరిభాషలో కుండలినీ శక్తి అని పేరు. నిస్సంగుల తపస్సు అంతా ఈ కుండలినీ శక్తిని లేపుటకే. కుండలినీ శక్తిని గ్రీకు భాషలో “స్పీరిమా” అంటారు. స్పీరిమా అంటే సర్ప వలయం. కుండలినిని సర్పంటైన్ గా పిలుస్తారు. శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవ రంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను ‘వెన్నుపాము’ అని అంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నెముక మధ్య నుంచి సర్పాకారంగా కుండలినీ శక్తి అనే సుషుమ్నా నాడిని లేవ జూపడమే నాగపూజ ప్రధాన ఉద్దేశమని విజ్ఞుల భావన.

కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలా ఉంటుందని “యోగశాస్త్రం”(Yoga Sasthra) చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మానవుడిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని, అందుకు నాగులచవితి రోజున ప్రత్యక్షంగా విష సర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే ‘శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసే సత్కర్మనే నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని భావన.

  • రామకిష్టయ్య సంగనభట్ల
RELATED ARTICLES
- Advertisment -

Latest News