దక్షిణ కొరియా మాజీ ప్రధాని(South Korea former PM) హాన్ డక్-సూ(Han Duck-soo)కి మార్షల్ లా కేసు(Martial Law Case)లో 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. క్యాబినెట్ కౌన్సిల్ సమావేశంలో మార్షల్ లా డిక్రీని ఆమోదించి విధానపరమైన చట్టబద్ధత ఇవ్వడానికి ప్రయత్నించడం ద్వారా తిరుగుబాటులో కీలక పాత్ర పోషించినందుకు కోర్టు హాన్‌కు శిక్ష వేసింది. అప్పటి అధ్యక్షుడు(Former President) యూన్ సుక్ యోల్(Yoon Suk Yeol) దురదృష్టకర రీతిలో మార్షల్ లా విధించడం తిరుగుబాటు(Rebellion)కు దారితీసిందని తీర్పిచ్చింది. 2024 డిసెంబర్‌లో మార్షల్ లా విధించిన కేసులో తిరుగుబాటు ఆరోపణలు రుజువైన తొలి యూన్ పరిపాలనాధికారిగా మాజీ ప్రధాని హాన్ డక్-సూ నిలిచారు.
ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూన్, అతని ఇతర సహచరులపై భవిష్యత్తులో రాబోయే తీర్పులకు ఇది సంకేతమని పరిశీలకులు భావిస్తున్నారు. యూన్ అభిశంసనకు, చివరికి ఆయన పదవి నుంచి తొలగింపుకు దారితీసిన మార్షల్ లా సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నాయకుల్లో హాన్ ఒకరు. తిరుగుబాటు అనేది దక్షిణ కొరియాలో అత్యంత తీవ్రమైన నేరారోపణల్లో ఒకటి. తిరుగుబాటుకు ప్రధాన సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న యూన్‌కు మరణశిక్ష విధించాలని స్వతంత్ర న్యాయవాది ఇటీవల డిమాండ్ చేశారు. యూన్‌పై తిరుగుబాటు ఆరోపణలకు సంబంధించి సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫిబ్రవరి 19న తీర్పు ఇవ్వనుంది.
