Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంShiva Kumar | నో ఆయిల్.. నో బాయిల్..

Shiva Kumar | నో ఆయిల్.. నో బాయిల్..

పొయ్యి వెలిగించకుండా, నూనె వాడకుండా ఆరోగ్యకరమైన వంటకాలు
ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న కోయంబత్తూర్‌కి చెందిన శివకుమార్
దాదాపు 2000 రకాల వంటలు చేస్తూ.. ప్రపంచ రికార్డ్ సాధించడం విశేషం
నమ్మాళ్వార్ భక్తుడైన శివ. ఆయన బాటలోనే పయనిస్తూ సరికొత్త చరిత్ర
శాఖాహారమే ఆరోగ్యరక్ష అని బోధించిన దైవ స్వరూపుడు నమ్మాళ్వార్
ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క పూటైనా ఆర్గానిక్ భోజనం తినాలంటున్న శివకుమార్

ఉరుకులు పరుగుల జీవితం. తినడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. పోనీ.. ఆ తినేదైనా సరిగా, ఆరోగ్యకరమైన తిండి తింటున్నారా? అంటే అదీ లేదు. జంక్ ఫుడ్స్, కల్తీ పదార్థాలు. దీంతో చేజేతులా ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. మన పెద్దలు ఎప్పుడూ చెబుతుండేవారు.. సాంప్రదాయసిద్ధమైన, ప్రాకృతికమైన ఆహారాన్ని(Natural Food) భుజించాలని. కానీ.. ఈ కాలంలో ఈ సలహాలను పాటించేవారు ఎవరు?. మానవ శరీరం.. అత్యంత సుసంపన్నమైన, వెలకట్టలేని అవయవాలతో నిండి ఉంటుంది. వాటిని కాపాడుకోవడం మన విధి. కానీ.. దానికి మార్గమేంటి?. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఆశాజ్యోతిగా కనిపించాడు.

- Advertisement -

పొయ్యి వాడకుండా, హాని చేసే నూనెలు వాడకుండా ఆహార పదార్ధాలను తయారుచేస్తూ ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇవి నమ్మశక్యంగా లేవు కదా. కానీ.. ఇది అక్షరాలా నిజం. ఆ నిజాన్ని మన కళ్ల ముందే చూపిస్తున్నాడు. ఏకంగా ఒక రెస్టారెంట్‌ను నడిపిస్తూ నో బాయిల్.. నో అయిల్‌(No Boil.. No Oil..)తో భోజనం తయారుచేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాడు. అతనే.. శివకుమార్. ఆయన క్రియేట్ చేసిన మరో ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం.

ఒక అద్భుతం ఆవిష్కృతం అవడానికి శివకుమార్ అనే వ్యక్తి అవిరళ కృషి చేశాడు. నిత్యం కాలుష్యంతో పోరాడుతూ తీసుకునే ఆహారం కూడా కలుషితం అవుతూ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్న ప్రజానీకానికి ఆయన ఒక చుక్కానిలా మారారు. ఆయన.. కేరళలోని కోయంబత్తూర్‌కు చెందిన వ్యక్తి. శివకుమార్ చేసిన కృషి ఇప్పుడు ప్రపంచానికి వెలుగును చూపిస్తోంది. పొయ్యి వెలిగించకుండా నూనెలు వాడకుండా వంటలు తయారుచేసి వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. శివకుమార్.. దైవ స్వరూపుడైన నమ్మాళ్వార్ భక్తుడు.

కృత్రిమ పద్ధతిలో తయారుచేసిన ఆహారాన్ని కాకుండా ప్రకృతిసిద్దమైన ఆహారం తీసుకోవడం మానవాళికి ఆరోగ్యకరమని చెప్పారు నమ్మాళ్వార్. ఆయన మాటలను వంటబట్టించుకొని ఆ బాటలోనే పయనిస్తున్నాడు శివకుమార్. తాను శాఖాహారి కాబట్టి ఆరోగ్యంగా ఉన్నానని, అందరికీ ఇదే పద్ధతి నేర్పించాలనే ఉద్దేశంతో ముందడుగు వేశాను అంటున్నారు. దీనికోసం ఆయన చేసిన పరిశోధనలు ఫలించాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే.. తంజాపూర్, తిరుచ్చి, శివకాశి, కుంభకోణం ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో పొయ్యి వెలిగించరు.

ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ ఆ ప్రాంతానికి వెళ్లి వారితో మమేకమవుతూ ఆ పద్దతులు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పొయ్యి లేకుండా నూనె లేకుండా వంటలు చేయడం నేర్చుకున్నాడు. ఆ పద్దతులపై ఒక సంవత్సరం పాటు పరిశోధనలు చేశాడు. నేర్చుకున్న ఆ పద్ధతులకు తన మేధస్సును జోడించాడు. ఆరోగ్యకరమైన ఆహారం తయారుచేయడం మొదలుపెట్టాడు. మొదట 30 రకాల పంటలు తయారుచేశాడు. ఆ తర్వాత దాదాపు 2000 పైచిలుకు వంటకాలు తయారుచేసి చరిత్ర సృష్టించాడు. అంతే కాదు. ఇటీవల ఆయన కోయంబత్తూర్‌లో “పడియల్ నో అయిల్, నో నాయిల్” పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభిచాడు.

ఈ హోటల్‌కి నుంచి ఆదరణ లభిస్తోంది. బియ్యం, పప్పు ధాన్యాలు, ఆకు కూరలతో వివిధ రకాల వంటకాలను తయారుచేస్తున్నాడు. పప్పు, సాంబార్, రసంతోపాటు రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను 80 రూపాయల నుంచి 150 రూపాయలకే మీల్స్ అంటూ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. బియ్యాన్ని ఉడికించకుండా కొబ్బరి పాలల్లో నానబెట్టి తినడానికి వీలుగా తయారుచేస్తాడు. ఇక సాంబార్ విషయానికి వస్తే పప్పును బాగా నానబెట్టి, రుబ్బి, అందులో బాదం, జీడిపప్పు మిక్స్ చేసి తయారు చేస్తాడు.

ప్రస్తుతం రోజుకు దాదాపు 75 మంది శివకుమార్ రెస్టారెంట్‌కు వచ్చి భోజనాన్ని ఆరగించి సంతృప్తిగా వెళ్తున్నారు. ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. తాను సాధించిన ఈ అద్భుతమైన నైపుణ్యాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకుండా తాను నేర్చుకున్న ఈ విద్యను ఇప్పటి వరకు పది వేల మందికి పైగా వ్యక్తులకు నేర్పించాడు. దీంతో శివకుమార్ పేరు మీద ప్రపంచ రికార్డు(World Record) నమోదైంది.

3 గంటల 30 నిమిషాల్లో 300 మంది విద్యార్థులతో 300 రకాల వంటకాలను తయారుచేయించాడు. పెద్దగా లాభం లేకపోయినా సహజ పద్ధతులతోనే వంటకాలు చేస్తూ కస్టమర్లకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నాడు. అందరూ రోజుకు ఒక్కసారైనా ఆర్గానిక్ ఆహారాన్ని(Organic Food) తీసుకోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారని తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News