- పసి హృదయాలకు ఇలాంటి సేవలు పెరగాలి సీపీ విజయకుమార్
సేవ తత్పరత ప్రతి మనిషిలో ఉండాలి, ఇతరుల కోసం చేయగలిగిన సేవే అసలైన మానవత్వం” అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయకుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయం శివారులో నిర్మించబడిన సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ను సీపీ విజయకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు చేయించుకున్న పసి హృదయాలను ప్రేమగా పలకరించిన సీపీ, వారికి మెమెంటోలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారుల గుండె ఆపరేషన్లు చేయడం అంటే ఎంతో కష్టతరమైన పని. అయినప్పటికీ ఇక్కడి వైద్యులు, సిబ్బంది నిస్వార్థ సేవా భావంతో పనిచేస్తున్నారు. ఇది నిజమైన మానవత్వానికి ప్రతీక” అని అన్నారు. సీపీ విజయకుమార్ కొనసాగిస్తూ సత్యసాయి సంస్థలు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవి. ఇలాంటి స్ఫూర్తితో మనమంతా సేవ తత్పరత అలవర్చుకోవాలి.

కొండపాక శివారులో ఏర్పడిన ఈ ఆసుపత్రి పేద ప్రజల పిల్లల జీవితాలకు నిజమైన సంజీవనిగా నిలుస్తోంది. కార్పొరేట్ స్థాయి సదుపాయాలు ఇక్కడ ఉచితంగా అందించడం దేశంలో దొరకని అరుదైన ఉదాహరణ” అన్నారు. దేశం కోసం కష్టపడుతున్న సైనికులు, పోలీసులు, డాక్టర్లు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులు అందరికీ గౌరవభావం ఉండాలని సూచించారు.
మానవజన్మ దేవుడిచ్చిన వరం. ఈ వరాన్ని ఇతరులకు ఉపయోగపడేలా మలచుకోవడమే నిజమైన భక్తి” అని అన్నారు. చివరగా ఆయన ఆసుపత్రి సిబ్బందిని, వైద్యులను అభినందిస్తూ సత్యసాయి బాబా ఆశీర్వాదంతో ఈ కేంద్రం దిగ్విజయంగా ముందుకు సాగి ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తుంది” అన్నారు.
