మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ కమిషనరరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జవహర్ నగర్ డివిజన్ కు ఏసిపిగా ఎస్ చక్రపాణి సోమవారం మధ్యాహ్నం 3.గంటలకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసిపి ఎస్ చక్రపాణి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పని చేస్తామని, పోలీస్ పబ్లిక్ సమన్వయం మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో సమర్థవంతమైన వ్యవస్థను అమలు చేస్తామని, యువతను నేరాల వైపు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. డివిజన్ ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
