జైలుకు వెళ్లొచ్చినా వాళ్ల తీరు మారలేదు. దీంతో మరోసారి నేరానికి పాల్పడి మళ్లీ ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. టీచర్‌ను బెదిరించి దోచుకున్న ముగ్గురు నిందితులను నర్సాపూర్ పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే పట్టుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో కేసును ఛేదించారు. నిందితులను సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేటకు చెందిన ఉప్పరి సాయికుమార్, గొలుసుల కుమార్, కొల్చారం మండలం రంగంపేటకు చెందిన దారగుల్ల అనిల్‌గా గుర్తించారు.
వీళ్లు ఈ నెల 16న ఒక ఆటోలో కొల్చారం బస్టాండ్ దగ్గర తుంగని కిష్టయ్య అనే టీచర్‌ని ఎక్కించుకొని నర్సాపూర్ సమీప తూప్రాన్ రూట్‌లోని కుంట వద్దకు తీసుకెళ్లి దాడి చేశారు. డబ్బు ఇవ్వకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చి రూ.1200, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. నిందితులు పుల్కల్ మండలం శివంపేటలో ఉన్నట్లు టెక్నాలజీ సాయంతో గుర్తించి అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.
