భూ హక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు సమూల మార్పులు తీసుకువస్తున్నాం.
ఒకే డిజిటల్ గొడుగు కిందకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ సమాచార సేవలు
వచ్చే జనవరి నాటికి మూడు శాఖల సమాచారంతో ప్రత్యేక యాప్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy).. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచనల మేరకు వచ్చే జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే NIC కసరత్తు చేస్తోందని తెలిపారు.
పొంగులేటి ఇంకా ఏమన్నారంటే..
- తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాం.
- రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాల్లో సరిహద్దుల, భూధార్ నంబర్ల కేటాయింపు వంటి ప్రధాన అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి పని పూర్తి చేశాం.
- ఈ ఐదు గ్రామాలకు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల తర్వాత వాటిని అందజేస్తాం.
- మిగిలిన 408 గ్రామాల్లో పట్టణ ప్రాంతాలు మినహా 373 గ్రామాల్లో రెండో విడత కింద సర్వే నిర్వహిస్తాం.
- మూడో విడతగా అన్ని జిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తాం.
- రాష్ట్రంలో ఇంతవరకు భూసమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల‌్లో అర్హత కలిగినవాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తాం.
- ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి దరఖాస్తులకు కూడా మోక్షం కల్పించాం.
- అధికారం చేపట్టిన నాటికి 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
- ఆ తర్వాత మరో నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి.
- వీటన్నింటినీ పరిష్కరించి ప్రజల సంతృప్తికి తొలి అడుగు వేశాం.
- ధరణి పోర్టల్ బాధ్యతలను ప్రభుత్వ సంస్ధలకు అప్పగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ధరణి పోర్టల్ నిర్వహణను టెరాసిస్ అనే విదేశీ సంస్ధ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్ధ NICకి అప్పగించాం.
- ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతుల కోటీ 56 లక్షల ఎకరాల భూమి వివరాలు ఇప్పుడు సురక్షితమైన స్వదేశీ సంస్ధ పరిధిలోకి వచ్చాయి.
- రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సరళీకృతం చేయడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం.
- అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై దరఖాస్తులను తీసుకున్నారు.
- అధికారంలోకి వస్తే గ్రామాల‌్లో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్దరిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ వారీగా విభజించి జీపీవోలను నియమించాం.
- అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే ప్రక్రియలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడంతోపాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం.
- ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేశాం.
- డిసెంబర్ నెల నుంచి మరో మూడు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
- పాత సర్వే పద్దులను పక్కన పెట్టి అధునాతన సాంకేతికను వాడి స్పష్టమైన భూసర్వే విధానాన్ని అందిస్తున్నాం.
- ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించే పరిస్ధితికి స్లాట్ బుకింగ్ ద్వారా తెరదించాం.
- రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు దశల్లో ఈ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టడమేగాక ఆధార్-ఈ సంతకం కూడా అమలు చేసి ప్రజల డబ్బు, సమయం ఆదా చేశాం.
- ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించాం.
- హిల్ట్ పాలసీపై నోరుందని ఏదిపడితే అది మాట్లాడుతున్నారు.
- గత ప్రభుత్వంలో మంత్రులు వారికి నచ్చినవారికి, ముడుపులు చెల్లించినవారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారు.
- వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చారు.
- మేం అలా చేయలేదు.
- పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశాం.
- ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టాను త్వరలోనే బయటపెడతాం.
