Tuesday, February 10, 2026
HomeతెలంగాణJubilee Hills | ప్రజాతీర్పు

Jubilee Hills | ప్రజాతీర్పు

  • గత రెండేళ్ల మా పాలనను గమనించి ఓటేశారు
  • ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది
  • హైదరాబాద్ అభివృద్ధిలో ఇక మరింత దూకుడు
  • విపక్షాలు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలి
  • కేటీఆర్, హరీష్ లు బాధ్యతాయుత పాత్ర నిర్వహించాలి
  • గెలుపొందిన అభ్యర్థి నవీన్ యాదవ్కు సన్మానం
  • మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అయినా బుద్ధి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. అప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మళ్లీ బుద్ధి చెప్పారు అంటూ కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వరుస ఓటముల తర్వాత కూడా వారి వైఖరి మారకపోతే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ” కనిపించకుండా పోవడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి.. అభినందనలు తెలిపారు.

ఎన్ని ఓటములు వచ్చినా .. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే ప్రజాసమస్యలు పరిష్కరించడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపై పోరాడడం కాంగ్రెస్ విధానమని అన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్పై నమ్మకం పెరుగుతోందని అన్నారు. అందుకు జూబ్లీహిల్స్లో విజయం నిదర్శనమని, విజయం అందించిన ప్రజలకు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు. నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కు సరైన ఫలితాలు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 39శాతం ఓట్లు వచ్చాయి. 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాకు ఓట్లశాతం 42కు పెరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు 51శాతం ఓట్లను ప్రజలు ఇచ్చారు. సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. గెలుపోటములకు కాంగ్రెస్ పొంగిపోదు, కుంగిపోదు. ప్రజల తరఫున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం అని అన్నారు.

రాష్ట్ర ఆదాయంలో 65శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోంది. నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ను సమస్యల రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్రె రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. మెట్రో, మూసీ ప్రక్షాళన సహా అనేక ప్రాజెక్టులకు అనుమతులను అడ్డుకుంటున్నారని మరోమారు ఆరోపించారు. కిషన్రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే భాజపాకు బాగా ఓట్లు తగ్గాయి. భాజపా ఓట్లు 65వేల నుంచి 17 వేలకు ఎందుకు తగ్గాయో కిషన్రెడ్డి ఆలోచించాలి. ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనించారు. భూ కంపానికి ముందు వచ్చే ప్రకంపనగా జూబ్లీహిల్స్ ఫలితాన్ని చూడాలన్నారు.

తీరు మారకుంటే భూకంపం వంటి ఫలితాలు భాజపాకి వస్తాయని హెచ్చరించారు. రాజకీయాలు మాని… రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలపై ఉంది. అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్ష నేతకు సూచిస్తున్నా అధికారం పోయినా.. కేటీఆర్లో అహంకారం, అసూయ పోలేదు. పదవులు ఎవరికీ శాశ్వతం కావు, కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా చాలా ఏళ్లు రాజకీయాలు చేయాల్సి ఉంది. ఫేక్ న్యూస్ రాయించి.. ఫేక్ సర్వేలు చేయించుకొని భ్రమలో బతకొద్దని కెటిఆర్కు సూచించారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోతుంది.. భాజపాకు డిపాజిట్ రాదని ముందే చెప్పానని ఫలితం అలాగే వచ్చిందన్నారు.

అయితే కొందరు మీడియా వారు అత్యుత్సాహంతో మాకు బిఆర్ఎస్ గెలవ బోతోందని ప్రచారం చేశారని, అది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్లో మద్దతు ఇచ్చిన ఎంఐఎంకు ధన్యవాదాలని, అసదుద్దీన్ ఒవైసీ బ్రదర్స్కు కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.. ఆయా రాష్టాల్ర పరిస్థితులను బట్టి పొత్తులు, మద్దతు ఉంటుంది. బిహార్ ఫలితాలను ఇంకా నేను సమీక్షించలేదని, దానిపై తరవాత స్పందిస్తానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు, ఆయన ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు.

కేసీఆర్ గురించి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తుంది.. మార్పు చేసి చూపిస్తాం అని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో పోలైన ఓట్లలో దాదాపు 51 శాతం కాంగ్రెస్కి, 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. దీని ద్వారా గత తమ పాలనను రెండేళ్ల ప్రజలు పరిశీలిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పార్టీ గెలుపుతో తమ బాధ్యత పెంచిందన్నారు. ప్రజల మన పనితీరును గమనించి తీర్పు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్లో అనేక సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.

అయితే తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వారు పోషిద్దామని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైడ్రా, ఈగల్ వంటివి ప్రజల కోసం తీసుకు వచ్చామన్నారు. కానీ వాటిపైనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దుష్పచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విష ప్రచారం ఆపాలంటూ బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి బీఆర్ఎస్ అడ్డుతగులుతోందన్నారు.

జూబ్లీహిల్స్లో తమ గెలుపు రెండేళ్ల పాలనకు ప్రతిఫలమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని సహకరించా లంటూ బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యత ఏమిటో ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనుచిత భాషతో అబద్ధాలను బీఆర్ఎస్ ప్రచారం చేసిందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్లను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకు వచ్చామని వివరించారు. కబ్జాలను అడ్డుకోవడానికి హైడ్రా తీసుకువచ్చామన్నారు.

అయితే నగరాభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించకపోగా అడ్డుపడుతోందన్నారు. తాము ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సచివాలయానికి రండింటూ ఆహ్వానించారు. కేంద్రంలో పెండింగ్ ఉన్న రాష్ట్ర అంశాలపై చర్చిద్దామంటూ కిషన్ రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి కోరారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ వివరాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి.. నివేదిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఆదేశించారు. మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్హెడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క, పొన్నం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News