కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రైతులపై కుట్ర జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ లో విలాసాలు చేస్తున్నారని విమర్శించారు.
కర్ణాటక మంత్రివర్గం మూడు రోజుల క్రితం ఆల్మట్టి ఎత్తును 519 అడుగుల నుండి 524 అడుగులకు పెంచాలనే నిర్ణయం కేవలం 100 TMC నీటి కోసం మాత్రమే కాదని, తెలంగాణకు కృష్ణా జలాల్లో హక్కు ఉన్న వాటాను లాక్కొని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాలను ఎడారులుగా మార్చే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ రైతుల ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు మీకు మాట్లాడే ధైర్యం, ప్రశ్నించే దమ్ము లేదా అని రేవంత్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరూ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జాతీయ పార్టీలకు జాతీయ విధానం ఉండాలని కెటిఆర్ ప్రకటించారు. “కర్ణాటక ప్రయోజనాల కోసం మీరు తెలంగాణ రైతులను త్యాగం చేస్తారా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే బిఆర్ఎస్ రైతులతో కలిసి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం జలాలను ఆంధ్రప్రదేశ్‌కు త్యాగం చేసి, ఇప్పుడు కృష్ణా జలాలను కర్ణాటకకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను దాని రెండు జీవనాధారాలపై దెబ్బతీసిందని కేటిఆర్ ఆరోపించారు. ఈ అన్యాయం పై బీఆర్ఎస్ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు.
