- కరోనా కాలంలో విశేష సేవలకు గౌరవం…
సమాజ సేవకు అంకితమై, కరోనా విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలిచి సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు,నేరేడుచర్ల మండలాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన పాలకవీడు మండలంలోని శూన్యం పహాడ్ గ్రామ వాసి సేవా కార్యకర్త,పాలకవీడు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ నరి నాయక్ కు జాతీయ స్థాయి(National Award) గౌరవం లభించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ‘మహాత్మా గాంధీ లీడర్‌షిప్ – 2026 నేషనల్ అవార్డు’ ను ఘనంగా ప్రదానం చేశారు.
ఫ్యాన్ ఇండియా, సోషియో కల్చర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్సీ పీవీ వాణీదేవి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శేష సాయి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్పీ రత్నం తదితరుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సేవా దృక్పథంతో ముందుకు వచ్చి వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆపద సమయంలో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు సామాజిక బాధ్యతతో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు.
అవార్డు అందుకున్నందుకు బాధ్యత మరింత పెరిగింది.
రమావత్ నరి నాయక్, పాలకవీడు
అవార్డు అందుకున్న సందర్భంగా నరి నాయక్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రజలకు చేసిన సేవలు, ఆయన చూపిన సత్యం, అహింస మార్గం తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
తనకు లభించిన ఈ జాతీయ పురస్కారం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అయితే దీనిని కేవలం గౌరవంగా కాకుండా మరింత బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఇలాంటి గుర్తింపులు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని గాంధీజీ చూపిన సేవా మార్గంలో నడుస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేయడమే తన లక్ష్యమని నరి నాయక్ పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
