- మియాపూర్ లో వరిటెక్స్ విరాట్ పేరుతో కబ్జా చేసి టవర్లు నిర్మిస్తున్న వైనం
- శేర్లింగంపల్లి మండల తహశీల్దార్ నిద్రపోతున్నాడా..?
- ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోకపోవడంలో మతలబేంటి..?
- గత తహశీల్దార్ వంశీ మోహన్ అక్రమాలకు పచ్చ జెండా ఊపుతున్నారా..?
- వరిటెక్స్ వర్మ కబ్జా విషయంలో హైడ్రా మౌనం వెనుక కారణం ఏమిటి..?
- ఉప ముఖ్యమంత్రి బట్టి మాటకు విలువే లేదా..?
- సర్వే నెంబర్ 35 హద్దులు నిర్ణయిస్తే టవర్లు కూల్చుడు ఖాయమంటున్న సామాజికవేత్తలు..
- చెరువు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే కట్టడి చేయాల్సిన హైడ్రా ఎక్కడుంది..?
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీకు లేదా..?
ముఖ్యమంత్రులనే లెక్కజేయలేదు.. ఇక ఉప ముఖ్యమంత్రి, మంత్రులను కేర్ చేస్తాడా..? తాను అనుకున్నది చేసేస్తాడు.. ఎంతకైనా తెగిస్తాడు.. నియమ నిబంధనలు, కోర్టు ఆర్డర్లు ఈయనకు అసలు పట్టవు.. అసలు ఇంత తెగింపు ఇతగాడికి ఎక్కడనుంచి వచ్చింది..? ఏకంగా ప్రభుత్వాలనే శాసించగలిగే కెపాసిటీ ఎలా ఏర్పడింది.. గత బీ.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని లెక్కజెయ్యలేదు… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లెక్కజేయడం లేదు.. పోనీ ప్రత్యేక హక్కులు ఉన్నాయా ప్రతి పక్షంలో ఉన్న బీజేపీ సైతం ఇతడి జోలికి వెళ్లడం లేదు.. ఉప ముఖ్యమంత్రి కలుగజేసుకోగానే ఏదో మతలబు చేసి ఆయన నోరు కట్టేశాడు.. మరి హైడ్రా లాంటి సంస్థ కూడా ఈయన జోలికి వెళ్లడం లేదు.. ఎందుకిలా జరుగుతోంది..? ఇతగాడికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా..? లేక ప్రత్యేకమైన చట్టాలు ఇతని కోసం చేశారా..? ఈపాటికి ఇతనెవరో తెలిసిపోయింది కదా.. వరిటెక్స్ వర్మ.. వారెస్ట్ పర్సనాలిటీ.. వరెస్ట్ రియల్టర్.

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివారులో రామసముద్రం కుంట నెలకొని ఉన్న సంగతి జగద్విదితమే..సర్వే నెంబర్ 35 హద్దులను ఫిక్సేషన్ చేస్తే వరిటెక్స్ విరాట్ పేరుతో నిర్మిస్తున్న సుమారు 5 టవర్లు ప్రభుత్వ భూమిలో చెరువులో వస్తున్నట్లు తెలుస్తుంది.. అమాయక ప్రజలు రంగు రంగుల బ్రోచర్లను, కంపెనీ చెప్పే కల్లిబొల్లి మాటల్ని విని కొనుగోలు చేస్తే చెరువులో నిర్మించిన నిర్మాణాలు కూలిపోయినా, కస్టమర్లు కొనుగోలు చేశాక ప్రభుత్వం కూల్చివేసినా నష్టపోయేది అమాయకులే.. వరిటెక్స్ వర్మ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఇరిగేషన్ అధికారులు తమ కళ్ళేదుటే కబ్జా చేస్తున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది..

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెరువులు కబ్జాకు గురి అయిన చిట్టాలో బట్టబయలు చేసిన విషయం విధితమే.. ఉప ముఖ్యమంత్రి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వంలో విలువే లేదా అన్న చందాన అధికారులు వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు.. ఆదాబ్ హైదరాబాద్ పరిశోధనాత్మక కథనాలు రాసి ఆధారాలతో బట్టబయలు చేసి, శేర్లింగంపల్లి మండల తహసిల్దార్ కు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. గతంలో ఇదే మండలంలో పనిచేసిన తహసిల్దార్ వంశీ మోహన్ వరిటెక్స్ వర్మ చేసే కబ్జాలకు, అలాగే అతగాడు చేస్తున్న అక్రమాలకు వత్తాసు పలికి తనకు అనుకూలంగా అన్ని నివేదికలు ఇవ్వడం, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించడం ఇతని కబ్జాకు కలిసొచ్చినట్లు అయ్యిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రామసముద్రం కుంట చెరువుతోపాటు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అక్రమాలను కట్టడి చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే బాధ్యత హైడ్రాకు లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి..

పేదల పాలిట యముడుగా మారిన రంగనాథ్.. పేద ప్రజలు పైసలు ఇచ్చి తెలియక కొనుగోలు చేసిన వారి ఇళ్ళను హైడ్రా కూల్చివేస్తే రోడ్డున పడ్డ కుటుంబాల ఉదంతాలు కో కొల్లలుగా ఉన్నాయి.. పేదల కబ్జాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు.. బడా నిర్మాణ సంస్థ అధినేత వర్మ చేస్తున్న కబ్జాలపై హైడ్రా కేసు ఎందుకు నమోదు చేయలేకపోతోంది అన్నది అంతు చిక్కని ప్రశ్న.. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత, భూ బదలాయింపు చేయకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కాకుండా నిషేధిత జాబితాలో పెట్టాలి..సంబంధిత సబ్ రిజిస్టార్లకు ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలు పంపాలి.. అమాయక ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని సామాజికవేత్త డాక్టర్ మహమ్మద్ అత్తర్ నవాబ్ డిమాండ్ చేశారు.. కొనుగోలుదారులు నష్టపోకుండా.. అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా చూడాలని.. పలుమార్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గౌరవ హైకోర్టు పలుమార్లు తెలిపినా ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేయకపోవడం బాధాకరమని పలువురు సామాజికవేత్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..
నేటికీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూముల కబ్జాలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకు పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా నిద్రపోతున్న అధికారులు మేలుకొని ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని మియాపూర్ లో ఉన్నటువంటి రామసముద్రం కుంటకు పునర్దశ వచ్చే విధంగా సర్వేనెంబర్ 35 హద్దులు ఫిక్సేషన్ చేసి అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్స్ వెలువెత్తుతున్నాయి.. వరిటెక్స్ వర్మ చేస్తున్న కబ్జాలకు సహకరించినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అక్రమాలపై వారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..
మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందిస్తారా..? హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధ్యతలు గుర్తుంటే వరిటేక్స్ వర్మను కట్టడి చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారా లేదా అన్న విషయాలు వేచి చూడాల్సి ఉంది.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీకు లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగాన్ని పంపి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వరిటెక్స్ వర్మకి ఇచ్చిన అక్రమ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని సామాజికవేత్త డాక్టర్ మహమ్మద్ అత్తర్ నవాబ్ డిమాండ్ చేస్తున్నారు.. తీగలాగితే డొంక కదిలినట్టు వరిటెక్స్ వర్మ చేస్తున్న కబ్జాలు రోజుకొకటి బట్టబయలు అవుతూనే ఉన్నాయి.. ఇదే తరహాలో వర్మ చేస్తున్న కబ్జాలకు సంబంధించి నాటి తహసిల్దార్ వంశీ మోహన్, ప్రోద్భలంతో నల్లగండ్లలో చేసిన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారానికి సంబంధించి మరో కథనం ద్వారా మరో కబ్జా వ్యవహారం వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..