- నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 వరకు నిషేధాజ్ఞలు
- మహిళలు,సాధారణ పౌరుల భద్రత కోసమే చర్యలు
- సీపి :అంబర్ కిషోర్ ఝా
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్లలో శాంతిభద్రతల పరిరక్షణకు,సాధారణ పౌరుల ఇబ్బందులను తొలగించడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ మేరకు సిటీ పోలీస్ యాక్ట్,1348 ఫసలీ నిబంధనలను అమలు చేస్తూ నవంబర్ 1,2025 నుండి డిసెంబర్ 1, 2025 వరకు నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం కొనసాగుతుందని,ఈ నిబంధనలు మహిళలు,ప్రజల భద్రత కోసం తీసుకున్నట్లు సీపీ వివరించారు.
నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) 223 నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా,శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారీ సౌండ్‌లతో కూడిన డీజేల వినియోగం,డ్రోన్ల వినియోగంపై ఉన్న నిషేధం కూడా కొనసాగుతుందని,మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అయితే ఏసీపీల ముందస్తు అనుమతి తప్పనిసరి అని సూచించారు.నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ఈ కాలంలో, పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,ర్యాలీలు,సభలు,సమావేశాలు నిర్వహించకూడదు.బంద్‌ల పేరిట బలవంతంగా సంస్థలను మూసివేయాలని ఒత్తిడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.
