Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంPublic Wealth | ప్రజా సంపదను దోచుకుంటున్న ముష్కరులు!

Public Wealth | ప్రజా సంపదను దోచుకుంటున్న ముష్కరులు!

యాదాద్రి భువనగిరి జిల్లాలో నారసింహుడి సాక్షిగా విస్తుపోయే నిజాలు
రాజాపేట మండలం చల్లూరు సర్వే నం.322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్
గంటకు సుమారు 300 టన్నులు.. ప్రజల జీవితాలపై గుదిబండలు..
శ్రీని డెవలపర్స్ పేరు మీద ఒక్క గుంట భూమి లేకపోయినా పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ అధికారులు
ఇక విద్యుత్ శాఖ రికార్డుల సంగతి సరే సరి
గతంలో అక్రమ బ్లాస్టింగ్‌పై కేసు నమోదైనా మారని పద్దతి
తహశీల్దార్, జీపీ, కలెక్టర్‌కి, మైనింగ్ అధికారులకు కనిపించని అవినీతి
ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు
తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
ప్రజల సంపదను ప్రజలే కాపాడుకోవాల్సిన తరుణం ఇది

చట్టాలున్నాయి.. నిబంధనలు ఉన్నాయి.. ప్రభుత్వం ఉంది.. అధికారులున్నారు.. న్యాయస్థానాలున్నాయి.. ప్రజల కోసం ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులున్నారు. కానీ.. ఏం లాభం? “అంగట్లో అన్నీ ఉన్నాయి గానీ అల్లుడి నోట్లో శని ఉంది” అనే సామెత ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఇన్ని అత్యంత కీలకమైన వ్యవస్థలు ఉన్నాసరే అక్రమార్కులు కాలర్ ఎగరేసుకుంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అమాయకులైన ప్రజలే చూస్తూ నిమ్మకుండి పోవాల్సిన దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి.

- Advertisement -

ఎందుకిలా జరుగుతోంది? సమాజం ఎందుకు వెనకబడిపోతోంది? డబ్బు, పరపతి ఈ రెండే రాజ్యమేలుతున్నాయి. వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అవినీతికి దాసోహం అంటున్నారు. తమను ఎన్నుకున్న ప్రజలు ఏమైతే మాకేంటి? ఐదేళ్ల తర్వాత కదా వారితో పని?. ఆ సమయానికి ఓ రెండు వేలు, ఒక క్వార్టర్ బాటిల్ పడేస్తే చచ్చినట్లు ఓట్లేస్తారు అనే ధీమాతో పేట్రేగిపోతున్నారు. అందుకే అక్రమార్కులతో అంటకాగుతూ విచ్చలవిడిగా సాగుతున్నారు.

ఇలాంటి దారుణ పరిస్థితే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో నెలకొంది. గత కొన్ని ఏండ్లుగా ఇక్కడ అక్రమంగా మైనింగ్, క్రషింగ్ జరుగుతోంది. ప్రజా సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆ దోపిడీదారు పేరు.. శ్రీని డెవలపర్స్. అక్రమ క్రషింగ్ చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ దారుణ వ్యవహారంపై ‘ఆదాబ్’ ఎన్నోసార్లు కథనాలు రాసి వెలుగులోకి తీసుకొచ్చింది. దురదృష్టం ఏంటంటే ఫలితం మాత్రం కనిపించడం లేదు.

నరసింహ స్వామి స్వయంభుగా వెలసిన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 322/4లో అసలు జరుగుతున్న తతంగం ఏంటి? కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎమ్మార్వో ఆఫీస్ నుంచి అనుమతి లేకుండా ఇంత పెద్ద స్టోన్ క్రషర్ ఎలా నడుస్తోంది? ఎందుకూ పనికిరాని జిరాక్స్ పేపర్లు పెడితే పర్మిషన్ ఇచ్చేస్తారా? ఇదే దారిలో మైనింగ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు కూడా అనుమతులివ్వడం చూస్తుంటే మతిపోతోంది. ఈ విధంగా మైనింగ్, కరెంట్, పొల్యూషన్ బోర్డ్ ఈ మూడు విభాగాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా పనిచేస్తున్నాయా?

ఈ మూడు విభాగాలకు 3 వేర్వేరు డాక్యుమెంట్లు పెడితే ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆర్టీఐ ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేయగా ఈ పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ గంటకు 300 టన్నులు. సంపాదన నెలకు రూ.6 కోట్లు. సంవత్సరానికి రూ.72 కోట్లు. ఈ అక్రమ క్రషరు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సాల్వ్ యజమాని జయరాంరెడ్డి, వాళ్ల పరివారం అంతా కలిసి ప్రారంభించారు. మధ్యలో హరి అనే వ్యక్తి అక్రమ క్రషర్ నడుపుతున్నాడు. ఇతని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేనా? మంత్రినా? లేక, అధికారులా?. ఇది ప్రజల సంపద. దీన్ని అక్రమంగా దోచుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?

క్రషర్‌ను నడుపుతున్న తీరు అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ వ్యవహారం వెనక ఉన్నది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యా? లేక, జిల్లా మంత్రా? లేక, గనుల శాఖ మంత్రి అండదండలతో నడుస్తోందా?. ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ప్రజల సంపదను నిస్సిగ్గుగా దోచుకుంటున్నా పట్టించుకునే నాథులు లేకపోవడంతో అర్ధంకాని పరిస్థితిలో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతోంది. సరైన ఉపాధిలేక జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. చిరు వ్యాపారులు, వ్యవసాయదారులు ఒక్కరేమిటి ఇలా అన్ని వర్గాల వారు సరైన సంపాదన లేక అలమటిస్తున్నారు.

ప్రభుత్వం ఒక పని చెయ్యొచ్చు. ప్రస్తుతం శ్రీని డెవలపర్స్ వారు తమ పేరు మీద గుంట భూమి లేకుండానే, అమ్మేసిన భూమి పత్రాలతో అక్రమంగా మైనింగ్ చేస్తూ క్రషర్ నిర్వహిస్తున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే అర్ధమేంటి? ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చేసుకోవచ్చు అనేగా. కనుక ప్రజలు కూడా తమ ఉపాధి కోసం చిన్న మైనింగ్ పనులు, అలాగే క్రషర్స్ నడుపుకుంటే తప్పేంటి?. వారికి ఆర్ధిక స్వావలంబన దొరుకుతుంది. అలాగే నిరుద్యోగ సమస్య తీరుతుంది. ప్రభుత్వానికి అద్భుతమైన ఆదాయం కూడా లభిస్తుంది.

నిశ్చింతగా పరిపాలన చేసుకోవచ్చు అని కొందరు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చెయ్యొచ్చు అని వారంటున్నారు. కంకర బిజినెస్‌లో కోట్లు దండుకుంటున్న అక్రమార్కులను కాపాడుతూ వస్తున్న ప్రజాప్రతినిధులు మనకు అవసరమా? లీడర్లను కాపాడుతున్న ప్రభుత్వం అవసరమా? అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాలు అవసరమా? మన ప్రాంతంలోని సహజ వనరులను మనమే కాపాడుకుందాం. మన సంక్షేమానికే వినియోగించుకుందాం.

అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్న అధికారుల వల్ల గానీ, ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల వల్ల గానీ ఎలాంటి ఉపయోగం లేనప్పుడు మనమే ముందుకు నడవడం అవసరంగా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. ప్రకృతి సంపదకు ప్రజలే రక్షణగా నిలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి సంపదను అక్రమార్కులు నిలువు దోపిడీ చేస్తున్నా నిలదీసే నాథుడే లేకుండా పోయాడు. ప్రభుత్వానికి, అధికారులకు ఎంత మంది ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు.

ప్రజాధనానికి రక్షణగా నిలవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అవినీతిపరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ అక్రమార్కులు కంకర వ్యాపారంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. పట్టించుకునేవారు, ప్రశ్నించేవారు లేరు. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ఈ అనధికారిక వ్యవహారాన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నా సర్కారు వైపు నుంచి సరైన స్పందన లేకపోవటం, అడ్డుకోకపోవటం స్థానికులకు ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తోంది.

చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా లెక్కచేయకుండా కొందరు అదే పనిగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా, జేబులు నింపుకుంటున్నా అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవటం విడ్డూరం. కొసమెరుపు ఏంటంటే.. జరుగుతున్న దురాగతాలపై రాజాపేట మండలం, చెల్లూరు గ్రామ ప్రజలు, యువత ఇంతకుముందు స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ.. ఎలాంటి స్పందనా లేదు. కాగా.. ఇక్కడ జరుగుతున్న బ్లాస్టింగులతో ఎన్నో నష్టాలు వాటిల్లుతున్నాయి. నీటి బోర్లు పూడుకుపోతున్నాయి. రైతుల పంటలు నాశనమవుతున్నాయి.

అధిక లోడ్‌తో టిప్పర్లు తిరుగుతుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. అదేవిధంగా క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. మరీ దారుణం ఏంటంటే అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్స్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై దత్తాయిపల్లి ప్రజలు గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం శూన్యం.

ఈ దారుణాలపై సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే, మంత్రులు పట్టించుకోకపోతే చెల్లూరు, ఆ పరిసర గ్రామాల ప్రజలు, యువత తిరగబడి వారే స్వయంగా క్రషర్‌ను మూసేసే తరుణం కూడా రాబోతోందని తెలుస్తోంది. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంతే కాకుండా క్రషర్ యాజమాన్యంపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహిస్తే వారికి సంబంధించిన అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.

అలాగే అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహిస్తే అవినీతిపరులు బయటపడే అవకాశం ఉందంటున్నారు సామాజికవేత్తలు. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? వేచి చూడాలి. అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకునే వరకు మా అక్షర పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తోంది ‘ఆదాబ్ హైదరాబాద్’. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’.

- Advertisement -
RELATED ARTICLES

Latest News