Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంVictims | డెలివరీ బాయ్స్ కాదు. దోపిడీ బాధితులు?

Victims | డెలివరీ బాయ్స్ కాదు. దోపిడీ బాధితులు?

మిస్టర్ అండ్ మిస్ డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్.. బీ కేర్ ఫుల్?
ప్రకటనల కోసం కోట్లు కుమ్మరిస్తున్న కార్పొరేట్ కంపెనీలకు..
డెలివరీ కార్మికుల కష్టాన్ని దోచుకునే నైతిక హక్కు ఎక్కడిది?
ఇదేనా మనం గర్వపడుతూ మురిసిపోతున్న డిజిటల్ ప్రపంచం?
కార్పొరేట్ తెలివితేటలకు నిరుద్యోగ యువత కుదేలవుతోంది?
డెలివరీ యాప్స్ దోపిడీకి హద్దులు, పద్ధతులు లేకుండా పోయాయి?
కార్మికులు ప్రమాదాలకు గురైతే బాధ్యత ఎవరిది. నష్టపరిహారం ఎవరిస్తారు?
కార్మికుల హక్కులను కాపాడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వానిదా? కాదా?
డియర్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.. ప్లీజ్ టేక్ యాక్షన్?

ఒకప్పుడు ఆకలి తీరాలంటే హోటల్‌కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మొబైల్ స్క్రీన్‌ మీద ఒక బటన్ నొక్కితే చాలు. తలుపు ముందుకే కోరుకున్న ఆహారం వస్తోంది. ఇదే.. డిజిటల్ విప్లవం అందించిన సౌకర్యం. కానీ.. ఈ సౌకర్యానికి నిజంగా ధర ఎవరు చెల్లిస్తున్నారు? వినియోగదారుడా? లేక కంపెనీనా? అంటే ఠక్కున వచ్చే సమాధానం ఇద్దరూ కాదు. డెలివరీ కార్మికుడు. అవును. నిజమే. రోడ్లపై ఎండలో, వానలో, ట్రాఫిక్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి పరుగులు తీస్తున్న డెలివరీ కార్మికుడే ఈ సిస్టమ్‌కు అసలైన ధర చెల్లిస్తున్నాడు.

- Advertisement -

సిల్లీగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. జొమాటో, స్విగ్గీ, బ్లింకెట్, జెప్టో వంటి యాప్‌లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనలతో మార్కెట్‌ను ఆక్రమించాయి. డెలివరీ పార్ట్నర్ అంటూ గౌరవ పదాలతో కార్మికులను పిలుస్తూ నిశ్శబ్దంగా వారి శ్రమను దోచేస్తున్నాయి. నిజానికి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఏ ఉద్యోగికీ ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనం లేదు. సామాజిక భద్రత లేదు. బయట మెరిసే డిజిటల్ ప్రపంచం వెనక, లోపల మౌనంగా దోపిడీ మాత్రమే కొనసాగుతోంది.

డెలివరీ రంగం ఎదుగుదల

మన దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతోపాటు ఆన్‌లైన్ పేమెంట్స్, యూపీఐ వ్యవస్థ విస్తరించడంతో డెలివరీ యాప్‌లు వేగంగా ప్రాచుర్యం పొందాయి. కరోనా మహమ్మారి సమయంలో లాక్ డౌన్ పరిస్థితులు ఈ సేవలను మరింత అవసరంగా మార్చాయి. ఇంటి తలుపు దగ్గరికి భోజనం, కూరగాయలు, ఔషధాలు చేరడం అనేక మందికి వరంగా మారింది. అయితే.. ఈ సౌకర్యాల వెనక పనిచేసే కార్మికుల పరిస్థితి మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుపడడం లేదు.

ప్రకటనల మాయాజాలం. కోట్ల ఖర్చు. అయినా నష్టాలే. ఎందుకు?

డెలివరీ కంపెనీలు తమ వ్యాపార ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. అప్పటికీ తాము ఆర్థికంగా నష్టాలనే ఎదుర్కొంటున్నామని చెప్పుకుంటున్నాయి. స్విగ్గీ రూ.1000 కోట్లు, జెప్టో రూ.1250 కోట్లు, జొమాటో రూ.100 కోట్లకు పైగా నష్టాల బాట పట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కంపెనీలు నష్టాల బాట పట్టినప్పటికీ టెలివిజన్ యాప్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్లు, డిస్కౌంట్ ఆఫర్లు.. ఇలా వినియోగదారులను ఆకర్షించడానికి సదరు కంపెనీలు చేస్తున్న విన్యాసాలు ఎక్కడా ఆగడంలేదు.

ఈ ప్రకటనలతో సదరు కంపెనీలకు కొనుగోళ్లు భారీగా పెరిగాయని తెలుస్తున్నప్పటికీ ఆ కంపెనీలు మాత్రం తమకు నష్టాలే వస్తున్నాయని చెప్పడం గమనార్హం. నిజానికి కంపెనీల ఆర్థిక స్థితిపై వ్యయం ప్రభావం చూపుతోందా? లేక, నకిలీ ఖాతాల సృష్టితో లాభాలను మరో ఖాతాలోకి మళ్లించి నష్టాలను చూపిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లాభాల కోసం కార్మికులపై ఒత్తిడి పెంచడం, పారితోషికాలను తగ్గించడం, ఇన్సెంటివ్ నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలకు కంపెనీలు పాల్పడుతున్నాయి. అంటే.. కార్పొరేట్ కంపెనీలు లావాదేలను తమ జేబుల్లోకి.. నష్టాల భారాన్ని డెలివరీ కార్మికులే మోసే పరిస్థితి తీసుకొస్తున్నాయి.

పార్ట్నర్ అనే పదం వెనక నిజం

డెలివరీ ఉద్యోగులను కంపెనీలు ఉద్యోగులుగా కాకుండా పార్ట్నర్లుగా పిలుస్తాయి. ఇది వినడానికి గౌరవంగా అనిపించినా వాస్తవానికి ఇది చట్టబద్ధమైన బాధ్యతల నుంచి తప్పించుకునే ఒక వ్యూహం. ఉద్యోగులైతే.. కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, సెలవులు., ఇవన్నీ ఇవ్వాలి. పార్ట్నర్ పేరుతో ఇవన్నీ తప్పించుకుంటున్నాయి కంపెనీలు.

ఆదాయపు వాస్తవ పరిస్థితి

బయట ప్రచారంలో వినిపించే ప్రకటనలు చూస్తే డెలివరీ బాయ్స్ నెలకు రూ.30-40 వేలు సంపాదిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ.. వాస్తవం భిన్నంగా ఉంది. ఒక ఆర్డర్‌కు వచ్చే పారితోషికం చాలా తక్కువ. ఇంధన ఖర్చులు, వాహన నిర్వహణ ఖర్చులు, మొబైల్ డేటా, యాప్ కమిషన్లు అన్నీ తీసేసిన తర్వాత చేతిలో మిగిలేది చాలా స్వల్పం. కొందరు రోజుకు 10-12 గంటలు పనిచేసినా కనీస వేతనానికి కూడా తక్కువగా సంపాదిస్తున్నారు.

ప్రమాదాల పట్ల నిర్లక్ష్యం

డెలివరీ ఉద్యోగం అనేది కేవలం బైక్‌పై తిరగడం మాత్రమే కాదు. ఎండ, వాన, చలి.. ఇలా అన్ని పరిస్థితుల్లోనూ పనిచేయాలి. రిస్క్ ఎక్కువ. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో గాయపడిన లేదా ప్రాణాలు కోల్పోయిన డెలివరీ కార్మికుల సంఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. కానీ.. చాలా సందర్భాల్లో కంపెనీల నుంచి సరైన సహాయం డెలివరీ కార్మికులకు అందడం లేదు. బీమా ఉందని చెబుతున్నప్పటికీ.. క్లెయిమ్ ప్రక్రియ కష్టతరంగా ఉండటం వల్ల చాలా మంది దాన్ని పొందలేకపోతున్నారు.

సామాజిక భద్రత లోపం

మన దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల(Unorganized sector workers) పరిస్థితి ఎప్పటి నుంచో దయనీయంగా ఉంది. డెలివరీ రంగం కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది. పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి భద్రతా వ్యవస్థలు లేకపోవడం వల్ల, అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నాయి.

వినియోగదారుల పాత్ర

డెలివరీ యాప్‌ల దోపిడీకి కంపెనీలే కాకుండా కొంత వరకు వినియోగదారులు కూడా కారణమని చెప్పొచ్చు. తక్కువ ధరలు, ఉచిత డెలివరీ, భారీ డిస్కౌంట్లు కోరుతూ.. వాటి వెనక ఉన్న కార్మికుల కష్టాన్ని మరిచిపోతున్నారు. కొందరు కస్టమర్లు డెలివరీ బాయ్స్‌తో అనుచితంగా ప్రవర్తించడం, అలస్యానికి వారినే బాధ్యులుగా నిలబెట్టడం కూడా ఆందోళనకరమైన విషయంగా చెప్పొచ్చు.

ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి

డెలివరీ యాప్ వంటి గిగ్ ఎకానమీ రంగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటీవల గిగ్ వర్కర్స్‌కు కొన్ని హక్కులు కల్పించాలనే చర్చ జరుగుతోంది. కానీ.. అవి ఇంకా చట్టరూపం దాల్చలేదు. కనీస వేతనం, బీమా, సామాజిక భద్రత, పని గంటల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు అవసరం.

కార్మిక సంఘాలు అవసరం

డెలివరీ కార్మికులు సంఘటితంగా తమ హక్కులు కోసం పోరాడే పరిస్థితి రావాలి. ఇప్పటికే కొన్ని నగరాల్లో డెలివరీ బాయ్స్ యూనియన్లు ఏర్పడి నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సంఘటిత శక్తి లేకుండా పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఒంటరిగా పోరాడటం చాలా కష్టం.

పరిష్కార మార్గాలు

కంపెనీలు లాభాల్లో కొంత భాగాన్ని కార్మిక సంక్షేమానికి కేటాయించాలి. ప్రభుత్వం గిగ్ వర్కర్స్ చట్టం తేవాలి. వినియోగదారులు కార్మికులను గౌరవించాలి. మీడియా ఈ అంశాన్ని నిరంతరం ప్రస్తావించాలి. డెలివరీ యాప్‌లు మన జీవితాన్ని సౌకర్యవంతం చేశాయి. కానీ.. ఆ సౌకర్యాల వెనక వేలాది కార్మికుల కష్టం, బాధ దాగి ఉంది. కొద్దిమందికి లాభాలు చేకూర్చి, మిగతావారిని దోపిడీకి గురిచేస్తే దాన్ని నిజమైన అభివృద్ధి అనలేం. డెలివరీ కార్మికుల హక్కులు, గౌరవం, భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం, సమాజం, కంపెనీలు కలిసి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News