Tuesday, March 3, 2026
HomeజాతీయంPresident | రఫెల్ ఫైటర్లో ముర్ము రైడ్

President | రఫెల్ ఫైటర్లో ముర్ము రైడ్

  • రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి
  • అంబాలా ఎయిర్ బేస్ నుంచి నింగిలోకి
  • పైలట్ యూనిఫాంలో రాష్ట్రపతి గగన విహారం
  • గతంలో సుఖోయ్-30 విమానంలోనూ ప్రయాణం
  • రాష్ట్రపతి ముర్ముతో రఫేల్ రాణి శివాంగీ సింగ్

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము భారత వైమానికి దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. ఫ్లెయింగ్ సూట్ ధరించిన రాష్ట్రపతి ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేసారు. ఇందులో యుద్ధ విమాన పైలట్ శివాంగీ సింగ్ తో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆమెని బంధించినట్లు పాక్ ప్రచారం చేయడంతో సింగ్ పేరు అప్పట్లో మార్మోగింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో దాయాది పాకిస్థాన్ సోషల్ మీడియాలో విపరీతంగా అసత్య ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారత్కు చెందిన రఫేల్ సహా పలు యుద్ధ విమానాలను నేలకూల్చామని, ఓ మహిళా పైలట్న బంధించామని పాక్ అబద్దాలు ప్రచారం చేసింది.

- Advertisement -

ఈ ప్రచారాన్ని భారత్ అప్పట్లోనే ఖండించింది. దీంతో నాడు శివాంగీ సింగ్ పేరు నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇప్పుడు ఆమెతో రాష్ట్రపతి ముర్ము ఫొటో దిగడంతో శివాంగీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె కోసం నెటిజన్లు శోధిస్తున్నారు. సింగ్ స్వస్థలం వారణాసి. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్సీసీలో చేరారు. ఆపై 2016లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. చిన్నతనం నుంచీ పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలు కన్న ఆమె.. ఎప్పటికైనా పైలట్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదటి దశ యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన మోహనా సింగ్, భావనా కాంత్, అవనీ చతుర్వేది స్ఫూర్తితో పైలట్గా శిక్షణ తీసుకున్నారు. 2017 లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికైన శివాంగీ.. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. మిగ్ ఫైటర్ జెట్లు నడిపిన అనుభవంతోనే 2020లో దేశంలోనే అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు.

అప్పటి నుంచి అంబాలా ఎయిర్బేస్లోని ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ బృందంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2022లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ‘భవిష్యత్తు కోసం భారత వైమానిక దళం రూపాంతరం చెందుతోంది’ అనే థీమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంలో రఫేల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటంపై శివంగి సింగ్ సెల్యూట్ చేస్తూ కనిపించారు. గణతంత్ర వేడుకల పరేడ్లో పాల్గొన్న రెండో పైలట్గా ఘనత సాధించారు. ఆ సమయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ‘రఫేల్ రాణి’ అంటూ చేసిన పోస్ట్ ఆకట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News