ఇన్నాళ్లూ బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచే సేకరణ
పరిమితులు తొలిగిపోయి కొత్త ఆశలు
భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం
ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి ఘనత
‘నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్’ అనే ప్రత్యేక ప్రక్రియ
గుండె ఆగిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ
మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతా చావ్లా ఆదర్శం
బ్రెయిన్ డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో నూతన శకం
మన దేశ వైద్య రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా.. సహజంగా మరణించిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు (Delhi Manipal Hospital Doctors) ఈ ఘనత సాధించారు. దీంతో అవయవదానంపై ఉన్న పరిమితులు (Limits) తొలిగిపోయి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
సాధారణంగా మన దేశంలో బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయినవారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. అంటే.. మెదడు పనిచేయడం ఆగిపోయి గుండె (Heart) కొట్టుకుంటున్నవారి నుంచే అవయవదానానికి చట్టపరమైన అనుమతి ఉంది. కానీ.. ఢిల్లీ వైద్యులు ‘నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్’ (Normothermic Regional Perfusion) అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి కూడా అవయవాలను సేకరించారు.
మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల గీతా చావ్లా (Geetha Chawla) ఊపిరితిత్తుల (Lungs) సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ముందుగానే తన అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు. నవంబర్ 6న రాత్రి 8.43 గంటలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజంగా మరణించారు. చట్టపరమైన నిబంధనల దృష్ట్యా ఆమె చనిపోయిన 5 నిమిషాల తర్వాత వైద్యులు ఈ ప్రత్యేక ప్రక్రియ ప్రారంభించారు.
ఇందులో పంప్ ద్వారా ఆమె పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణను కృత్రిమంగా పునరుద్ధరించారు. దీనివల్ల కాలేయం, మూత్రపిండాలు పాడవకుండా సజీవంగా ఉన్నాయి. అనంతరం వాటిని విజయవంతంగా సేకరించి అవసరమైనవారికి అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ గత 2 దశాబ్దాలుగా వాడుకలో ఉన్నా మన దేశంలో దీన్ని చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో దేశంలో అవయవాల కొరతను అధిగమించేందుకు ఒక కొత్త మార్గం తెరుచుకున్నట్లయింది. గీతా చావ్లా కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం, వైద్యుల నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
