ఇదేమీ అర్థంకాని కాన్సెప్ట్ కాదు: ఎమ్మెల్సీ కవిత
జనం బాట కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్
అవకాశం, అధికారం, ఆత్మగౌరవం.. ఇవే తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruti President), ఎమ్మెల్సీ (Mlc) కవిత అన్నారు. ఇది అర్థంకాని కాన్సెప్ట్ ఏమీ కాదని చెప్పారు. ఇప్పుడు విద్య అందరికీ అందుబాటులో లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తలేరని విమర్శించారు. దీంతో నష్టపోయేది ఎవరో ఆలోచించాలని కోరారు. ఆడబిడ్డలు మాత్రమే నష్టపోతారని పేర్కొన్నారు. ఫీజు కట్టాల్సి వస్తే తల్లితండ్రులు మగ పిల్లలకు ఫీజు ఇస్తారు గానీ ఆడవాళ్లకు ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆడబిడ్డలకు అన్యాయం ఆగ్రహం వెలిబుచ్చారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్‌లో ఆమె మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు..
అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచి వేస్తోంది. అదే విధంగా అధికారంలో వాటా. ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాల్సిందే. అధికారంలో మహిళల వాటా 5 శాతం కూడా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదు. అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరముంది. మైనార్టీల (Minority) పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ మైనార్టీ మంత్రి లేని మొట్ట మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మైనార్టీ, ఎస్టీ మంత్రి లేని ప్రభుత్వం. కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి. అందరికీ సమాన అవకాశాలు రావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి.
ఇక ఆత్మగౌరవం(Self Respect)తో కూడిన అభివృద్ది. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి పెట్టింది పేరు. అవకాశం, అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మగౌరవం వస్తుంది. నేను ఒక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసమే మాట్లాడటం లేదు.. తెలంగాణలోని అందరి కోసం మాట్లాడుతున్న రిజర్వేషన్లు, అవకాశాలు, ఉపాధి విషయంలో సమానత్వం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. గ్రూప్ -1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాను. ఆయన సుమోటో గా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం.
ఆ 8 మంది గ్రూప్ -1 (Group-1) స్థాయిలో ఉండి 30 ఏళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో తెలంగాణకు నష్టం జరుగుతుంది. వారందరినీ ఆపే వరకు పోరాటం చేస్తాం. యువతకు జరిగిన నష్టంపై మాట్లాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, ఉద్యమకారులను కలుస్తాం, వాళ్లు పెన్షన్ కావాలని అంటున్నారు. దానికోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తాం. నిజామాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు, ఉద్యమకారులు కూడా వచ్చి నన్ను కలిశారు. అమరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలన్నదే నా కోరిక.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు (Brs Mla) ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదు. నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్ని. వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేశా. నా విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అసలు నేను బయటకు రావాలని అనుకోలేదు. అనివార్య పరిస్థితుల్లోనే బయటకు వచ్చాను. వారు కాదనుకున్న తర్వాతే పార్టీకి రాజీనామా చేశాను. పార్టీలో ఉండగా మాట్లాడాల్సి అన్ని చోట్ల మాట్లాడాను. కానీ పార్టీకి నష్టం చేసే వారిదే పై చేయి అయ్యింది. బీఆర్ఎస్ లో బాధ్యతను మరిచిన మోసపూరిత వ్యక్తులదే పై చేయి అయ్యింది.
వారి కారణంగా బీఆర్ఎస్, కేసీఆర్(KCR)కు నష్టం జరగనుంది. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు తెలియని తెలంగాణ కాదు. నా బాధ ప్రజలకు చెబుతా. వాళ్ల బాధ వింటా. పరిష్కార మార్గానికి ప్రయత్నం చేస్తా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. స్థానిక జాగృతి కార్యకర్తలు ఏ పార్టీ ఓటు వేయాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారు. పార్టీ పెట్టుడు పెద్ద పని కాదు. కానీ పార్టీ కన్నా కూడా ప్రజల సమస్యలు తీరటం ముఖ్యం. కేసీఆర్ గారు నాతో పార్టీ పెట్టిస్తున్నారా? అలాంటిది ఏమీ లేదు. నాకు, కేసీఆర్ గారికి ఏదీ ఉన్న బయటకు చెప్పే అలవాటు ఉంది.
నాతో పార్టీ పెట్టించాల్సి అవసరం ఆయనకు లేదు. బీఆర్ఎస్ లో జరిగిన ఘటనలు దురదృష్టం. పోరాటాల పార్టీలో ఇలా జరగకూడదు. నా విషయంలో కేసీఆర్ గారి నిర్ణయంతోనే సస్పెండ్ చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ లో నా ఓటమికి ఎమ్మెల్యేలే కారణమని నేను చాలాసార్లు చెప్పాను. ఒక పార్టీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆత్మపరిశీలన, రివ్యూ అవసరం. ఐదేళ్ల క్రితమే ఎవరి పనితీరు ఏంటీ? అని తెలుసుకొని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ పెట్టిన రివ్యూ మీటింగ్ లలో చాలా మంది అదే చెప్పారు. నేను బీఆర్ఎస్ లో తిరుగుబాటు చేయలేదు. అంత అవకాశం ఇవ్వకుండానే నన్ను బయటకు పంపారు. కాంగ్రెస్ వాళ్లు నాకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదు.
కాంగ్రెస్ కే ప్రజల నుంచే దిక్కు లేదు. నాకు వాళ్లు ఏమీ సపోర్ట్ చేస్తారు. మునిగిపోయే నావ కాంగ్రెస్. వాళ్లతో నాకేం పని. నాకు చాలా మంది మద్దతు ఉంది. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ఆ అధికారాన్ని కాపాడుకోలేకపోతోంది. ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ గారు కచ్చితంగా మంచి సీఎం, మంచి నాయకుడు. కానీ కొంతమంది కారణంగా ఆయనకు చెడ్డ పేరు వస్తోంది. బీఆర్ఎస్ ను గానీ, కేసీఆర్ గారిని గానీ ఇష్యూ బేస్డ్ గా మాత్రమే విమర్శిస్తా. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడున్న బీజేపీ ఎంపీ ఉన్న లేనట్లే. గతంలో మాధవ నగర్ బ్రిడ్జి గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు రెండేళ్లు అయిన సరే బ్రిడ్జి పనుల్లో పురోగతి లేదు.
గతంలో కే ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి లేదా మోడీ తో మాట్లాడి బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలి. బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో అర్వింద్ గారు రాజీనామా చేయండి. అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుంది. మీరు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలి పోతారు. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీ లో ఉంది. మీరు రిజైన్ చేస్తే బిల్లు కచ్చితంగా అవుతుంది. నేను జనం బాటకు వస్తున్నానని తెలిసి మరో బీజేపీ ఎంపీ నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆయన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతా.
మంచిప్ప ప్రాజెక్ట్ ను కట్టబోమని రేవంత్ రెడ్డి చెప్పాడు. అక్కడి పోడు రైతులకు పట్టాలు ఇస్తా అన్నాడు. కానీ చేతికొచ్చిన పంటను విషం చల్లి పాడు చేశారు. దీంతో ఒక రైతు అదే విషంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మూడు ఎకరాల్లో పంట వేసిన ఆ రైతుకు ఎంత పెట్టుబడి అయ్యి ఉంటుంది? పోడు రైతుల విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్లు సంయమనం పాటించాలని కలెక్టర్ గారు చెప్పండి. మంచిప్ప ప్రాజెక్ట్ కట్టకపోతే అక్కడి రైతులకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వండి. అంతేకానీ ఇలా రైతులకు అన్యాయం చేయటం ప్రభుత్వానికి మానవత్వం కాదు. గోదావరి వరద ముంపు ప్రాంతమైన యంచ అనే గ్రామంలో పొలాలను పరిశీలించాను. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు చాలా నష్టపోయారు. అందరూ మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మంత్రి తుమ్మల సహా కలెక్టర్ ది తప్పు అంటున్నారు.
ఇది రాజకీయాలకు సమయం కాదు. రైతులకు అండగా ఉండాల్సిన సమయం. నవీపేట మండలంలోనే 5 వేల ఎకరాల నష్టం జరిగింది. ఒక్కో ఎకరాకు రూ. 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మక్క రైతులకు 400 బోనస్ అన్నారు. దాదాపు 70 వేల ఎకరాల్లో మక్కా రెతులకు నష్టం జరిగింది. ఇప్పటి వరకు కాంటాలు పెట్టలేదు. వారంతా రూ. 1700 లకే క్వింటాల్ అమ్మేశారు. మీ పట్టి లేని తనం వల్ల ఒక్కో మక్కా రైతుకు క్వింటాకు రూ. 700 నష్టం జరిగింది. వరి విషయంలోనూ ఈ ప్రభుత్వం ఇలాగే చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ధాన్యం తడిసి, బూజు పట్టి ఉంది. ఈ ప్రభుత్వం రైతులకు నష్టం లేకుండా కచ్చితంగా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి.
గతేడాది బోనస్ తో కలిపి ఈ ఏడాదిది కూడా ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఏ రకం అయినా సరే బోనస్ ఇస్తాం అన్నారు. కానీ తర్వాత మాట మార్చారు. కనీసం సన్న రకం ధాన్యానికైన సరిగా బోనస్ ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లాలో బీడీ కంపెనీ వాళ్లు కోత పెట్టటంతో మహిళలకు నష్టం జరుగుతోంది. అన్ని బీడీ కంపెనీల వాళ్లు కోత పెడుతున్నారు. దీనిపై జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలి. నిన్నటి నుంచి నిజామాబాద్ లో ఉన్నా. జనం బాట కార్యక్రమానికి వచ్చిన నాకు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు.
