- సర్కిల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు..
- బిజెపి కూటమి వైపు నాయకుల చూపు..
- జిహెచ్‌ఎంసిలో విలీనంతో చోటా లీడర్ల భవిష్యత్తు కనుమరుగు..
- తెరవ వెనక వివిధ పార్టీ లీడర్లతో మంతనాలు షురూ..
నిజాంపేట్ సర్కిల్‌లో ఎన్నికల సందడి మొదలైంది. పార్టీలపరంగా నాయకులు తమ అనుచర గణాలతో సమావేశాలకు తెర లేపారు. రిజర్వేషన్లపై సమాలోచనలు చేస్తూ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోటీకి సిద్ధమే అంటూ క్లారిటీ ఇస్తూ రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉన్నా పోటీకి సై అంటున్నారు. సొంత పార్టీ కాకపోతే పక్క పార్టీ అంటూ కొందరు. తమకే టిౖట్ కన్ఫర్మ్ అని, మరికొందరు.తేడా వస్తే తమ సత్తా చూపుతామంటూ బహిరంగంగానే చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజాంపేట్ సర్కిల్ లో రాజకీయ రణరంగం మొదలైంది.
నిజాంపేట్ సర్కిల్ లోని వివిధ పార్టీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై మల్ల గుల్లాలు పడుతున్నారు. కార్పొరేషన్ జిహెచ్‌ఎంసిలో విలీనం అవ్వడంతో తమ రాజకీయ భవిష్యత్తుకు దారులు వెతుక్కుంటున్నారు. 33 మంది కార్పొరేటర్లు ఉన్న నిజాంపేట్ కార్పొరేషన్ జిహెచ్‌ఎంసి నాలుగు డివిజన్లుగా ఏర్పడడంతో చోటా లీడర్ల రాజకీయ భవిష్యత్తు కనుమరుగు కానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా లీడర్లు తమ కుటుంబంలోని ఎవరినో ఒకరిని ఎన్నికల బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నప్పటికీ రిజర్వేషన్లు ఎటు నుండి ఎటు దారితీస్తాయో అంటూ మదన పడుతున్నారు.
టిౖట్ తమకే వస్తుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే పక్క పార్టీ నాయకులతో రహస్య చర్చలకు తెర లేపారు. నిజాంపేట్ సర్కిల్లో నాలుగు డివిజన్లు మాత్రమే ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నుండి టిౖట్లు ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉందనే చెప్పాలి. అధికార పార్టీలోని ఒకే కుటుంబానికి చెందిన అరడజను మంది నాయకులు కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ప్రగతి నగర్, నిజాంపేట్ కు చెందిన మాజీ కార్పొరేటర్లు అధికార పార్టీ నుండి పోటీ చేసేందుకు సర్వశక్తులు వడ్డేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాహటంగానే చెబుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు మూడు నుండి ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రిజర్వేషన్లు ఖరారు అయితే ఎక్కడినుండి పోటీ చేయాలని అనుచర గణంతో ఎప్పటికప్పుడు తర్జనభర్జన చేస్తూనే మరోవైపు బడా నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు అనుగుణంగానే కలిసివచ్చే పండుగలను, అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలోని ఆశావాహులు టిౖట్టు రాని యెడల బిజెపి కూటమి నుండి బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు లీకులు వదులుతున్నారు. నిజాంపేట్‌కు చెందిన ఓ బిఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త ఇప్పటికే పచ్చ పార్టీ, కమలం పార్టీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. రిజర్వేషన్లు ఖరారు అయితేనే ఎవరు ఎక్కడినుండి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే స్పష్టత రానుంది.
బీఆర్‌ఎస్‌లో పోటీపై కొంత క్లారిటీ :
నిజాంపేట్ సర్కిల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ పోటీపై కొంత క్లారిటీ గానే ఉన్నట్లు తెలుస్తుంది. రిజర్వేషన్ల విషయం పక్కనపెడితే నాలుగు డివిజన్‌లలో రెండు బీసీ, ఒక ఎస్సి, ఒక ఓసికి అవకాశం కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిజాంపేట్‌కు చెందిన బిసి, ఓసి ఇద్దరు నేతలు పోటీకి సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. బాచుపల్లికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నాయకులు కచ్చితంగా పోటీలో ఉండే అవకాశం ఉంది. కార్పొరేషన్ లో ముగ్గురు బీసీ నాయకుల పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం ఓసి, బిసి ఫార్ములాని అమలు చేస్తుందా …? ఎస్సీ, బీసీ, ఓసి ఫార్ములాని అమలు చేస్తే ఎవరు పోటీలో ఉంటారు అనే చర్చ పార్టీలో జోరుగా కొనసాగుతుంది. ఏది ఏమైనాప్పటికీ నిజాంపేట్ సర్కిల్లో రిజర్వేషన్లు, అభ్యర్థుల పోటీపై ఉత్కంఠ నెలకొని ఉంది.
