- నిర్మల్ ఎస్పీ డా. జానకి షర్మిల
హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో వారు పాల్గొని నిర్మల్ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు.

యువత వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవంతో,సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
