- అనంత కోటి రాజు వేగేశ్న ఫౌండేషన్ ధాత సహకారంతో నూతన భవనం
- నిత్యం 2000 మంది భక్తులకు అన్న ప్రసాదం
- తిరుమల తిరుపతి తరహాలో అన్న ప్రసాద భవనం
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సన్నిధిలో కొండకింద విశాలమైన నూతన అన్నప్రసాద భవనాన్ని ఆదివారం ఆలయ ఈవో వెంకట్రావు, భవన దాత అనంత కోటి రాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన భవనం అందుబాటులోకి రావడంతో సంతోషంగా ఉందని, ప్రతినిత్యం సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని నిరాటంకంగా పంపిణీ చేయనున్నామని అన్నారు.ఈ భవనాన్ని అన్ని హంగులతో సకల సౌకర్యాలతో నిర్మించామని తెలిపారు.
ఈ భవనం అందుబాటులోకి రావడంతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులందరికీ స్వామివారి అన్నప్రసాదాన్ని అందించే దిశగా యాదాద్రి దేవస్థానం ముందుకు వెళుతుందని అన్నారు.ఇందుకు సహకరించిన డోనర్ అనంత కోటి రాజును ఆలయ ఈవో అభినందించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.ఇలాంటి దాతలు మరింత మంది ముందుకు వచ్చి దేవస్థాన అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అన్నారు.దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి మాట్లాడుతూ సుమారు 21 కోట్లతో అన్నదాన భవన సత్రమును మహాద్భుతంగా నిర్మాణం చేపట్టడం జరిగిందని, గత ఐదు సంవత్సరాల నుండి వేగేశ్న ఫౌండేషన్ అనంత కోటి రాజు యొక్క ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.
యాదాద్రిలోనే కాకుండా తిరుపతిలో వెంగమాంబ సత్రము, ద్వారకా తిరుమల అన్నదాన సత్రము,వరంగల్ భద్రకాళి దేవాలయంలో జలప్రసాదము,అనేక దేవాలయాలలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాలు జల ప్రసాదము నిర్మిస్తారని అన్నారు. అనంతరం ఆలయ ఈవో వెంకట్రావు, భవనధాత అనంత కోటి రాజు, చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నూతన భవనంలో ప్రత్యేక పూజలు,సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించి అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించారు.అనంతరం భక్తులకు పెద్దఎత్తున స్వామివారి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దేవస్థానం అధికారులు సిబ్బంది వివిధ విభాగాల వారు జర్నలిస్టులు అన్న ప్రసాదం స్వీకరించారు అనంతరం దాతను ఆలయ అధికారులు పూలమాలలు శాలువాలతో సత్కరించారు కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
