- ఐదు నెలలుగా జీతాల్లేక సిబ్బంది ఆవేదన!
- ఏజెన్సీ నిర్లక్ష్యం… అధికారుల మొండి వైఖరి
- ఐదు నెలలుగా పస్తులు..పీఎఫ్ కూడా కట్టలే?
నల్గొండ : ప్రభుత్వ ఆసుపత్రి అనగానే పేద, మధ్యతరగతి ప్రజలకు నమ్మకమైన ఆశ్రయం. కానీ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బంది పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ముఖ్యంగా శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 70 మందికి గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జీతాలు ఇవ్వని ‘ఏ వన్ ఏజెన్సీ’
తొమ్మిది నెలల క్రితం నియమించుకున్న ఈ సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ఏ వన్ ఏజెన్సీపై ఉంది. అయితే, ఏజెన్సీ తీరు అత్యంత నిర్లక్ష్యంగా ఉండటంతో, సిబ్బంది ఐదు నెలలుగా ఒక్క పైసా కూడా అందుకోలేదు. వేతనాల సమస్యతో పాటు, వారికి చెల్లించాల్సిన పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) కూడా ఏజెన్సీ కట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొర ఆలకించని సూపరింటెండెంట్..
జీతాల కోసం పరితపిస్తున్న సిబ్బంది నేడు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమ కష్టాలు, ఇళ్లల్లో కుటుంబ పోషణ భారంగా మారిన విషయాన్ని ఆమే కు మొరపెట్టుకున్నారు. అయితే, సూపరింటెండెంట్ అయిన డాక్టర్ అరుణకుమారి నుంచి వారికి నిరాశే ఎదురైంది.”మాకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదు. మాకేం సంబంధం లేదు. ఏజెన్సీ వాళ్లనే అడగండి” అంటూ ఆమె నిర్మొహమాటంగా సమాధానం చెప్పినట్లు సిబ్బంది వాపోతున్నారు. ఆసుపత్రి నిర్వహణలో అత్యంత కీలకమైన సిబ్బంది సమస్యకు ఉన్నతాధికారి స్పందన ఇలా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“భార్యాపిల్లలతో పస్తులు” ఉంటున్నాం..
జీతాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక, నిత్యావసరాలు కొనడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో ఉన్నామని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. “ఇళ్లల్లో భార్యాపిల్లలతో పస్తులు ఉంటున్నామని” కన్నీటిపర్యంతమయ్యారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల తాము అప్పుల పాలవుతున్నామని, తమను పట్టించుకునే వారు లేరా అంటూ రోదిస్తున్నారు.
వార్త కవరేజ్ అడ్డుకున్న సూపరింటెండెంట్!
సిబ్బంది బాధలను కవర్ చేయడానికి ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి ప్రయత్నించగా, సూపరింటెండెంట్ అరుణకుమారి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. “నా అనుమతి లేనిది మీరెవరు వీడియో ఫోటోలు తీయడానికి? మీరు వార్తలు రాసుకుంటూ పోతే మేము పని చేసినట్లేనా?” అంటూ ఆమె విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “మీ ఐడి కార్డు చూపియండి, మీరు రిపోర్టరేనా?” అని ప్రశ్నిస్తూ, “నాకు ఒక రూల్స్ ఉన్నాయి. ఆస్పత్రికి రావద్దు, ఇక్కడ తీయవద్దు” అంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న విలేకరి పట్ల ఆసుపత్రి ఉన్నతాధికారి ఈ విధంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
