పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తానని నమ్మబలికి పలువురిని మోసం చేసిన మహిళను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ బోయగూడ కి చెందిన సాగు కవిత (44) అనే మహిళ 2025 సంవత్సరంలో నాగోల్ డివిజన్ పరిధిలోని మమతా నగర్, రోడ్ నెంబర్–2లో “విజన్ ఇన్ఫ్రా” పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది.
అనంతరం ప్రజలను ఆకర్షించే విధంగా పెట్టుబడి పథకాన్ని ప్రకటించింది. ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 100 రోజులలో అసలు లక్ష రూపాయలతో పాటు రూ.80 వేల రూపాయలను వడ్డీగా ఇస్తామని చెప్పి పలువురిని నమ్మించింది.
ఆమె మాటలను నమ్మిన నాగోల్ ప్రాంతానికి చెందిన సుమారు 25 మంది పెట్టుబడిదారులు 2 కోట్ల వరకు డబ్బులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బంజారా కాలనీకి చెందిన రామావత్ మహేందర్, రామావత్ ఠాగూర్ నాయక్, రామావత్ కుమార్, సంధ్యారాణి, కేతావత్ నాగేష్ తదితరులు పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు.
పెట్టుబడిదారులను మరింత నమ్మబలికేందుకు దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో ఐదు గుంటల భూమిని సెక్యూరిటీగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే 100 రోజుల గడువు దాటినా వడ్డీ ఇవ్వకపోవడంతో పాటు పెట్టిన అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులకు అనుమానం వచ్చింది.
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు నాగోల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు సంధ్య, బాబు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చీటింగ్ మరియు తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ ఫైనాన్స్ ఇష్టబ్లిషమెబట్ యాక్ట్ 199 ప్రకారం ఆరెస్ట్ చేసి న్యాయ మూర్తి ముందు హాజరు పరిచి దర్యాప్తు చేస్తున్నారు.
