- ఆయనపేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం భావ్యమా..?
- రాహుల్ గాంధీకి లేఖ రాసిన పేద చిన్నారులు..
- ఎక్స్ లో పోస్ట్ చేసిన బీ ఆర్ ఎస్ నేత సతీష్ రెడ్డి..
ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని నిలదీశారు. ఈ మేరకు వారు రాహుల్‌గాంధీకి బుధవారం లేఖలు రాశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, సామాన్య పౌరులకు అండగా నిలవాలని మీరు చెప్పే వ్యాఖ్యల పట్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజల గొంతుక వినాలని చెప్తున్న రాహుల్..
మూసీ ప్రాజెక్టు విషయంలో తమ గొంతుకను ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ఖర్చు చేసేటప్పుడు ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని రాహుల్ గతంలో చెప్పారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకోకుండా కట్టే ప్రాజెక్టులతో ఏం లాభమని చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేతను ప్రశ్నించారు.
పేదలు ఎన్నో కలలుగని కట్టుకున్న ఇండ్లను గాంధీ విగ్రహం కోసం కూల్చడం ఏమిటని బీఆర్‌ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారులు రాహుల్‌గాంధీకి లేఖ రాస్తున్న ఫొటోలను పోస్టు చేశారు. జీవితం మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ‘గాంధీ సరోవర్’ కట్టడానికి ధ్వంసం చేయడం సరికాదని అన్నారు.
