Thursday, February 12, 2026
Homeహైదరాబాద్‌Mudiraj | ఒకే వేదికపై ముదిరాజ్ అగ్ర నేతలు

Mudiraj | ఒకే వేదికపై ముదిరాజ్ అగ్ర నేతలు

  • రవీంద్రభారతిలో మార్మోగిన జై ముదిరాజ్ నినాదం
  • రాజకీయ చైతన్యానికి ప్రతీకగా సర్పంచుల సన్మాన సభ
  • రాబోయే ఎన్నికల్లో సర్పంచుల పాత్ర కీలకం-కాసాని వీరేష్
  • సమాజ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం:-బొర్రా జ్ఞానేశ్వర్
  • రేపటి ఎమ్మెల్యేలు–ఎంపీలు నేటి సర్పంచులే:-శ్రీహరి
  • ప్రజలతో ఉండే నాయకత్వమే అసలైన విజయం:- ఈటల
  • ఐకమత్యమే ముదిరాజుల బలం:- కాసాని జ్ఞానేశ్వర్
  • ఆర్థిక–సామాజిక పురోగతికి ఉమ్మడి కార్యాచరణ:-బండ ప్రకాష్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముదిరాజ్ సమాజంలో పెరుగుతున్న చైతన్యానికి హైదరాబాద్ లోని రవీంద్రభారతి సాక్షిగా నిలిచింది. గ్రామస్థాయి పాలనలో కీలక బాధ్యతలు స్వీకరించిన ముదిరాజ్ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఘన సన్మాన కార్యక్రమం, సమాజ ఐక్యతతో పాటు ముదిరాజుల భవిష్యత్ రాజకీయ ఆశయాలను స్పష్టంగా ప్రతిబింబించింది. ఒకే వేదికపై ముదిరాజ్ కీలక నేతలంతా ఒక్కటవ్వడం, ఈ కార్యక్రమాన్ని సాధారణ సన్మాన సభకన్నా ముందుకు తీసుకెళ్లి, రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన సంఘటనగా మార్చివేసింది..

ఈ కార్యక్రమానికి ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర క్రీడలు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్ ముదిరాజ్, అఖిల భారత కోలి సమాజ్ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ తాడిత ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సుమారు 680 మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ సభకు హాజరై ఘన సన్మానాలు అందుకున్నారు.

- Advertisement -

సమాజ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం- మంత్రి వాకిటి శ్రీహరి

సమాజ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులలో సర్పంచులకు మాత్రమే రాజ్యాంగబద్ధమైన చెక్ పవర్ ఉందని గుర్తుచేస్తూ, గ్రామ పాలనలో వారి బాధ్యత మరింత పెరిగిందన్నారు. నేటి సర్పంచులే రేపటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ముదిరాజుల జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటుల్లో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే మంత్రి పదవినే త్యాగం చేసి ముదిరాజులను బీసీ–ఏలో చేర్చేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పడం సభలో ప్రత్యేక స్పందన రేపింది. ముదిరాజుల ఐక్యతను చాటేందుకు త్వరలో పరేడ్ గ్రౌండ్‌లో భారీ సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ…

సర్పంచ్‌గా గెలవడం ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గెలవడంకంటే కష్టమని వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన నాయకత్వమని, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ముందుండాలని సూచించారు. ముదిరాజ్ నాయకులకు అవసరమైనప్పుడు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ ..

సమాజం ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గెలిచిన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి అంకితమవ్వాలని సూచించారు. భావితరాల భవిష్యత్తుకు ఉన్నత విద్యే ప్రధాన ఆయుధమని, ముదిరాజులు తమ పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

అఖిల భారత కోలి సమాజ్ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ…

ముదిరాజుల ఆర్థిక–సామాజిక అభివృద్ధికి విడివిడిగా ప్రయత్నాలు కాకుండా ఉమ్మడి కార్యాచరణ అత్యవసరమని అఖిల భారత కోలి సమాజ్ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ముదిరాజ్ సమాజానికి సంబంధించిన జీఓ.ఎం.ఎస్. నం.15ను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

ముదిరాజ్ కులాన్ని బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చే అంశంపై మంత్రి వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ చొరవ చూపాలని కోరారు. ఇది కేవలం ఒక సామాజిక డిమాండ్ మాత్రమే కాకుండా, సమాజానికి న్యాయమైన రాజకీయ హక్కుల ప్రశ్నగా భావించాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే ఎంపీటీసీ, జడ్పిటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నికల్లో ఇప్పుడే ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా రాబోవు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ముదిరాజ్ నాయకుల విజయంలో గ్రామస్థాయి నాయకత్వమే నిర్ణాయక శక్తిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

మొత్తంగా, ఈ సన్మాన సభ ముదిరాజ్ సమాజంలో పెరుగుతున్న రాజకీయ అవగాహనకు, ఐక్యతకు, భవిష్యత్ ఆశయాలకు స్పష్టమైన ప్రతిబింబంగా నిలిచింది. గ్రామ స్థాయి నాయకత్వం నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ముదిరాజ్ సమాజం అడుగులు వేస్తోందన్న బలమైన సంకేతాన్ని ఈ సభ రాజకీయ వర్గాలకు స్పష్టంగా పంపింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు,తెలంగాణ ముదిరాజ్ జాక్ అధ్యక్షులు డాక్టర్ వినోద్, ముదిరాజ్ నాయకులు బోన్ల లక్ష్మణ్ ముదిరాజ్ , ఆగం పాండు ముదిరాజ్ ,అల్లుడు జగన్ ముదిరాజ్ ,గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News