లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలి
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆదేశం
వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన
రైతులకు పంట నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
అన్ని శాఖల సమన్వయంతో వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..
మొంథా తుపాను (Mantha Cyclone) ప్రభావంతో వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) దృష్ట్యా ప్రజల భద్రతపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని వరంగల్ (Warangal) ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kavya) సూచించారు. కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మునిసిపల్, పంచాయతీరాజ్, రోడ్లు మరియు భవనాలు తదితర శాఖల అధికారులతో ఎంపీ డాక్టర్ కావ్య టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే ప్రమాదం ఉన్న గ్రామాలు, కాలనీల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, చెరువులు, వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు (Warning boards) ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. రైతుల పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ చేపలు పట్టడానికి, నీటి ప్రవాహాల వైపు వెళ్లరాదని ఎంపీ ప్రజలను హెచ్చరించారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని, అత్యవసర సహాయార్థం అధికారులు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్లతో సంప్రదించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సహాయక బృందాలను సిద్ధం చేయాలని, అవసరమైన ఆహార పదార్థాలు, వైద్య సాయం, ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
