- ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
- పద్మారావును కలిసిన ట్రాన్స్‌కో ఉత్తర మండలం విద్యుత్ అధికారులు
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,అవసరమైతే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం ట్రాన్స్‌కో ఉత్తర మండలం సర్కిల్ అధికార యంత్రాంగం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను మోండా మార్కెట్‌లోని ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా పరిస్థితులు,పెండింగ్ సమస్యలు,భవిష్యత్ అవసరాలపై విస్తృతంగా చర్చించింది.
ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ గోపయ్య నేతృత్వంలో డివిజనల్ ఇంజనీర్ శ్రీ బ్రహ్మానందం,ఏ.డి.ఈలు మహేష్ కుమార్, దుర్గా ప్రసాద్,సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు శ్రీకాంత్,వరలక్ష్మి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ డిమాండ్ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడం అత్యవసరమని అన్నారు.లో వోల్టేజ్ సమస్యలు,ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడింగ్,తరచూ జరిగే పవర్ కట్‌లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు.ప్రజా అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని,అవసరమైన చోట్ల మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అధికారులు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని విద్యుత్ సమస్యల నుంచి విముక్తం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు.

