- రుణం ఒకప్పుడు అవసరాన్ని తీర్చే సాధనం..
- ఇప్పుడు జీవితాన్ని నియంత్రించే శక్తిగా మారింది ..
- ఒకప్పుడు “సేవింగ్స్” అని పిలిచిన బలమైన అలవాటు
- ఇప్పుడు “ఈఎంఐ కల్చర్”కి బదిలి అయిపోయింది …
- జీతం బ్యాంక్‌లో పడకముందే ఈఎంఐలు తన్నుకుపోతున్నాయి
- దీంతో సామాన్యుడి పెట్టుబడి ఆలోచనే కనుమరుగైపోయింది..
- అవసరాల కోసం అప్పులు చేయడం తప్పు అసలే కాదు ..?
- ఆడంబరాల కోసం అప్పులు చేసి తిప్పలు పడటం ముమ్మాటికీ తప్పు..?
- మనం తీసుకునే రుణాలను మనం నియంత్రిస్తున్నామా?
- లేక రుణాలే మన జీవితాలను నియంత్రిస్తున్నాయా….?
- ఇది ఒక్క కుటుంబం కథ కాదు..
- మొత్తం సమాజాన్ని చుట్టేసిన మౌన సంక్షోభం.
- ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం ….
ఉదయం సూర్యుడు ఉదయించేలోపే కళ్లుతెరుస్తాడు సామాన్యుడు..బస్ స్టాప్ చేరుకునేలోపే జీతం లెక్కలు, ఈఎంఐ లెక్కలు అతని మదిలో తిరుగుతుంటాయి.ఇంటి ఖర్చులు,స్వంత ఇంటి కోసం చేసిన రుణం, వాహన రుణం, పిల్లల స్కూల్ ఫీజులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు..హెల్త్ మీద చెల్లించే ఖర్చులు…ఇలా సామాన్యుడి జీవితం అంతా లెక్కల బంధనంగా మారిపోయింది.ఒకప్పుడు “సేవింగ్స్” అంటే గర్వంగా చెప్పుకుని తిరిగే మధ్యతరగతి కుటుంబాలు ..ఇప్పుడు “ఈఎంఐ” అనే పదం వింటేనే ఒత్తిడికి లోనవుతున్నాయి…..ఇల్లు సొంతమైందని ఆనందపడే వ్యక్తికి..
ఇంకా 20 ఏళ్లపాటు ఆ ఇల్లు కోసం బ్యాంక్‌కి అద్దె కట్టాల్సిన వాస్తవం గ్రహించినప్పుడు గుండెలు జారిపోతున్నాయి.. .రుణం ఒకప్పుడు అవసరాన్ని తీర్చే సాధనం.. ఇప్పుడు అది జీవితాన్ని నియంత్రించే శక్తిగా మారిపోయింది..ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక సౌకర్యాలు, వినియోగ సంస్కృతి పెరిగినప్పటికీ మధ్యతరగతి మనిషి మాత్రం మనశ్శాంతిని పొందలేకపోతున్నాడు …అవసరాలకోసం తీసుకున్న రుణాలు క్రమంగా ఆర్భాటం కోసం తీసుకునే బంధనాలుగా మారి, కలల కోసం ప్రారంభమైన జీవితం అప్పుల అగాధంలో చిక్కుకుకుని గిలగిలా కొట్టుకుంటుంది….ఇక్కడ ఎవరికీ అర్ధంకాని ప్రశ్న ఏమిటంటే మనం తీసుకునే రుణాలను మనం నియంత్రిస్తున్నామా? లేక మనం తీసుకునే రుణాలే మన జీవితాలను నియంత్రిస్తున్నాయా….?
రుణం సామాన్యుడి పాలిట వరమా ..? శాపమా..?
దేశ ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి వర్గం చాలా కీలకమైన శక్తి. సంపన్నులు విలాసజీవితం గడపవచ్చు, పేదలు ప్రభుత్వ పథకాలతో కొంత మద్దతు పొందవచ్చు. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్నది మధ్యతరగతి కుటుంబాలు …వీరు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి, తమ కుటుంబానికి గృహం, విద్య, వైద్యం, భవిష్యత్తు భద్రత కోసం పనిచేసే వర్గం.కానీ ఇదే వర్గం ఇప్పుడు ఒక కనపడని సంకెళ్లలో తెలియకుండానే చిక్కుకుంటుంది.అది రుణం అనే పేరుతో ఉన్న బంధనం.

నిజానికి రుణం అవసరమా..? అనర్ధమా ..?
రుణం తీసుకోవడం తప్పు అసలే కాదు. రుణం అనేది ఆర్థిక చక్రంలో ఒక భాగం.గృహం కొనుగోలు చేయడానికి, పిల్లల విద్య కోసం, వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఆరోగ్య అత్యవసరాలకు రుణం చాలా సహాయం చేస్తుంది.కానీ అదే రుణం నియంత్రణ తప్పితే .. అది సహాయకుడి నుంచి శత్రువుగా మారుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో రుణం “సహాయం” కంటే “బాధ్యత” కాకుండా “భారం”గా మారిపోయింది.సామాన్యుడి నెల జీతం,మొదటి పది రోజులకే మటుమాయమై పోతుంది.. హోమ్ లోన్, వాహన లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, వ్యక్తిగత రుణాలు, ఎలక్ట్రానిక్ ఈఎంఐలు…ఇక మిగిలేది కేవలం మానసిక ఒత్తిడి, ఆర్థిక ఆందోళన, భవిష్యత్తుపై అనిశ్చితి.
మధ్యతరగతి మనస్తత్వత్తమే ఆర్థికపరమైన చిక్కులకు కారణమా ?
రుణాల వెనుక మానసిక కారణాలు కూడా చాలానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్న మాట..మధ్యతరగతి మనిషి జీవితం “తనకు లేని దానిని కలిగి ఉండాలనే” ఆకాంక్ష చుట్టూ తిరుగుతోంది.ఒక సహోద్యోగి కొత్త కారు కొనుగోలు చేస్తే, తనకు కూడా కావాలి.ఒక పొరుగింటి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారని తెలిసినప్పుడు, మన పిల్లలకు ఆ అవకాశాలు ఇవ్వాలని తపన.ఒక స్నేహితుడు కొత్త ఫ్లాట్ బుక్ చేశాడంటే, మనమూ వెనకపడకూడదనే ఆలోచన.
ఈ సామాజిక పోలిక (సోషల్ కంపేరిసన్ ) సామాన్యుడి ఆర్థిక శాంతిని కొల్లగొడుతోంది.ఫలితంగా, ఒకప్పుడు “సేవింగ్స్” అని పిలిచిన మన బలమైన అలవాటు ఇప్పుడు “ఈఎంఐ కల్చర్”కి బదిలి అయిపోయింది …జీతం వచ్చిరాగానే ఈఎంఐ తన్నుకుపోతుంది..దీంతో సామాన్యుడి పెట్టుబడి అనే ఆలోచనే కనుమరుగైపోతుంది..

గృహ రుణం సొంతింటి కల, జీవితనికి భారమా..?
ఇల్లు కొనుగోలు చేయడం అనేది భారతీయ మధ్యతరగతి కుటుంబాలలో అతి పెద్ద కల..ఒక సొంత గూడు అనే భావన ఎప్పటినుంచో మన సంస్కృతిలో ఉంది.అందుకే బ్యాంకులు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లు ఇస్తామని ఆకర్షిస్తుంటాయి..
కానీ ఒకసారి ఆ రుణపు బంధనంలో అడుగుపెట్టాక …20 నుంచి 30 ఏళ్లపాటు నెలకు పెద్ద మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి ..రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుని 20 సంవత్సరాలు చెల్లిస్తే, చివరికి బ్యాంక్‌కు సుమారు రూ.1 కోటి వరకు కట్టేస్తున్నాడు ….అంటే రెండు ఇండ్లు కట్టేంత ధర బరువు సామాన్యుడు మోస్తున్నాడన్నమాట ..జీవితంలో కొన్ని అనివార్య కారణాలతో ఒక్క సారి కూడా జీతం ఆలస్యమైతే…కోవిడ్ లాంటి సంక్షోభం వస్తే..లేదా ఉద్యోగం పోతే …ఆ రుణం “స్వప్నం” నుంచి “భయంకర నిద్ర”గా మారిపోతుంది.
వాహన రుణాలు అవసరమా? ఆర్భాటమా?
కార్లు, బైకులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి..కానీ కొత్త మోడల్ వస్తే, ఉన్న వాహనం వదిలేసి కొత్తది కొనాలనే మోజు ఇటీవల చాలా మందిలో పెరిగింది.ఒక 10 లక్షల కారు కొంటే, దానికి 4 నుంచి 5 లక్షల వడ్డీ కట్టాల్సి వస్తుంది.రెండు సంవత్సరాలకే ఆ కార్ విలువ సగం అవుతుంది.అంటే ఆ రుణం విలువ కంటే నష్టమే ఎక్కువ.అయినా “సొసైటీకి చూపించుకోవాలి” అనే ఆలోచన, సోషల్ మీడియా ఫొటోలు, స్టేటస్ సింబల్ ప్రలోభాలు మధ్యతరగతిని ఆర్థికంగా దిగజారుస్తున్నాయి..
హెల్త్ రుణాలు అనివార్యం అయినప్పటికీ అవి కూడా బారాలే ..?
ఆరోగ్య సమస్యలొస్తే ఆర్థిక పరిస్థితి కుదేలవడం కొత్త విషయమేమి కాదు.ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లులు లక్షల్లో ఉంటున్నాయి.. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అది చాలా సందర్భాల్లో సరిపోవడంలేదు…ఆరోగ్య రుణాలు, గోల్డ్ లోన్లు, క్రెడిట్ కార్డ్ అప్పులు.నిజం చెప్పాలంటే ఒక ఇంటి యజమాని అనారోగ్యం భారిన పడితే కుటుంబం మొత్తం అప్పుల్లో కూరుకుపోతుంది. తల్లిదండ్రుల వైద్యం కోసం తీసుకున్న రుణం, పిల్లల భవిష్యత్తును తాకుతుంది.
క్రెడిట్ కార్డ్ రుణాల గురించి చెప్పనక్కర్లేదు..?
క్రెడిట్ కార్డ్ అంటే చాలా మందికి “సౌలభ్యం” అనిపిస్తుంది.కానీ వాస్తవానికి ఇది ఒక చతురస్ర ఉచ్చు.వడ్డీ రేట్లు 36% వరకు ఉంటాయి.ఒకసారి బకాయిలు పెరిగితే, వాటి నుంచి బయటపడడం కష్టం.ఎలక్ట్రానిక్ వస్తువులు, లగ్జరీ షాపింగ్, హోటల్ బిల్లులు, ట్రావెల్ బుకింగ్స్…కార్డును వాడుకునేటప్పుడు గ్రాండ్ గానే ఉంటుంది..కానీ బిల్లు కట్టేటప్పుడు చమటలు పడతాయి..ఎప్పుడైనా నెలాఖరులో చెల్లింపులు మిస్ అయితే వడ్డీ పెరుగుతూ పెరుగుతూ భారం అవుతుంది.
ఆర్థిక రుణాలపై సామాన్యుల మానసిక ప్రభావం..?
రుణం కేవలం ఆర్థిక బరువు కాదు, అది ఒక మానసిక భారం కూడా.తల్లిదండ్రుల మద్య తరచూ జరిగే వాదనలు,
పిల్లల భవిష్యత్తుపై కలిగే ఆందోళన,సొసైటీ ముందు అపకీర్తి భయం…ఇవి అన్నీ రుణపు బారిన పడిన కుటుంబాల దైనందిన వాస్తవాలు.మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉత్పాదకత తగ్గుతుంది, ఆనందం కనుమరుగవుతుంది.
ఇలా రుణం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, తరతరాలను ప్రభావితం చేస్తుంది.

రుణపు చక్రం ఆర్థిక వ్యవస్థకు ముప్పు..?
వ్యక్తుల స్థాయిలో రుణభారం పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చేడు సంకేతం.రుణాలపై ఆధారపడి కొనుగోళ్లు జరిగితే …వాస్తవ ఆదాయం పెరగకపోయినా వినియోగం పెరుగుతుంది.ఇది తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక అసమతుల్యతకు దారితీస్తుంది.బ్యాంకులు చెడు రుణాల బారిన పడతాయి,కన్స్యూమర్ క్రెడిట్ మార్కెట్ అస్థిరమవుతుంది,మధ్యతరగతి ఖర్చు సామర్థ్యం తగ్గిపోతుంది.దీని ప్రభావం చివరికి మొత్తం ఆర్థిక చక్రంపై పడుతుంది.
ఎందుకు పెరుగుతున్నాయి రుణాలు?
సులభంగా లభించే రుణాలు:
బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్స్ ఇప్పుడు సెకన్లలో రుణం ఇస్తున్నాయి.“కేవలం ఆధార్,పాన్ లతో లోన్” అనే ఆఫర్లు మధ్య తరగతి కుటుంబాలను తెగ ఆకర్షిస్తున్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ మాయ:
ప్రతి సోషల్ మీడియా పోస్ట్ “కొనండి, వెంటనే పొందండి, తరువాత చెల్లించండి” అనే భావనను నాటుతుంది.
వేతనాలు స్థిరంగా ఉండటం:
జీవన వ్యయం పెరుగుతున్నా జీతం అంతగా పెరగడం లేదు.మధ్యతరగతి ఖర్చు పెంచుకోవాలంటే రుణం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
భద్రతలేమి:
“రేపు ఏమవుతుందో తెలియదు” అనే భయం కూడా ఒక రకంగా రుణాల వైపు నడిపిస్తోంది ..
ఇప్పుడే జీవించాలి అన్న భావనతో.
రుణాలు ఎంతవరకు మేలుచేస్తున్నాయి ..?
రుణాలు తప్పనిసరి అయిన కొన్ని సందర్భాలు ఉన్నాయి …గృహం (లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్),విద్య (మానవ మూలధనం అభివృద్ధి),వ్యాపారం (ఆర్థిక వృద్ధి కోసం),కానీ వీటి కోసం కూడా తీసుకునే రుణాలు లిమిట్‌లోనే ఉండాలి.అవి మనం తిరిగి చెల్లించ గలిగే స్థాయిలో ఉండాలి..రుణం మనకు సేవ చేయాలి, మనం రుణానికి సేవ చేయకూడదు.
రుణాల నుంచి ఎలా బయటపడాలి? ఆర్థిక జాగ్రత్తలు..?
బడ్జెట్ ప్లానింగ్ చక్కగా చేయాలి:
ఆదాయం,ఖర్చులు,సేవింగ్స్ స్పష్టంగా లెక్కించాలి.“మొదట సేవ్ చేయి, తరువాత ఖర్చు చేయి” అనే సూత్రం ఖచ్చితంగా పాటించాలి.
ఈఎంఐలు 40% దాటకూడదు:
మొత్తం నెల జీతం నుంచి రుణ చెల్లింపులు 40% లోపు ఉండెలా చూసుకోవాలి..
ఎమోషనల్ భయింగ్ తగ్గించాలి:
ఫ్యాషన్, లగ్జరీ వస్తువుల కోసం రుణం తీసుకోవడం ఆపాలి.
అత్యవసర నిధి ఏర్పరచాలి:
కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచాలి.
ఇన్వెస్ట్మెంట్ అలవాటు పెంచాలి:
చిన్న మొత్తాలతో ప్రారంభించినా, మ్యూచువల్ ఫండ్స్,ఆర్దీ,పీఎఫ్ వంటి సాధనాలతో సేవింగ్స్ పెంచాలి.
ఆర్థిక విద్యా అవగాహన అవసరం:
స్కూల్ స్థాయి నుంచే ఆర్థిక నిర్వహణ గురించి అవగాహన కల్పించాలి.
మధ్యతరగతి భవిష్యత్తు ఆశతో కూడిన జాగ్రత్త
మధ్యతరగతి మనుషులు ఎప్పుడూ కష్టపడి తమ స్వంత బలం మీదే ఎదగాలి అని అనుకుంటారు..కానీ అదే వర్గం రుణపు వలలో చిక్కుకుంటే, సమాజ ఆర్థిక సమతుల్యత నిజంగా దెబ్బతింటుంది.అందుకే ఈ వర్గం ఆర్థికంగా సుస్థిరంగా ఉండటం దేశానికి,సమాజానికి కూడా బలం.రుణం తీసుకోవడం సిగ్గు కాదు..తప్పు అసలే కాదు..,కానీ రుణంలో మునిగిపోవడం చాలా ప్రమాదం.స్వప్నాలు కలగాలి,..కానీ అవి బంధనాలుగా మారకూడదు.రుణాలు ఒక దిక్కులో అభివృద్ధికి మార్గం చూపుతాయి..మరో దిక్కులో బాధల బాటలో నడిపిస్తాయి.ఇది పూర్తిగా మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.మధ్యతరగతి వర్గం తన ఆశయాల మధ్య, వాస్తవాల మధ్య సంతులనం నేర్చుకోవాలి.రుణాలను ఆవశ్యకతగా కాకుండా ఆశ్రయంగా భావించడం ప్రారంభించిన రోజు నుంచే మన ఆర్థిక స్వాతంత్ర్యం ప్రారంభమవుతుంది. అప్పుడు మాత్రమే మధ్యతరగతి కుటుంబాలు నిజంగా బలపడుతాయి…. అప్పుడు ఒకటో తారీకు ఓ వేడుక రోజుగా మారిపోతుంది..
