Homeనల్లగొండMattampally | అటవీ భూములపై హైడ్రామా

Mattampally | అటవీ భూములపై హైడ్రామా

  • తనిఖీలను అడ్డుకునేందుకు గిరిజన రైతుల యత్నం…
  • భూములు తమవేనంటూ ఆత్మహత్యకు యత్నించిన రైతు… అడ్డుకున్న అధికారులు..
  • ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: విజిలెన్స్ డీఎఫ్‌ఓ శివయ్య

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల(Mattampally Mandal) పరిధిలోని మంచ్య తండా శివారులో గొర్లగూడ బీట్ అటవీ భూముల విజిలెన్స్ తనిఖీలు ఉద్రిక్తతకు దారితీశాయి.పూర్తి వివరాల్లోకి వెళితే… గొర్లగూడ (వర్ధాపురం) ఫారెస్ట్ బీట్ పరిధిలోని డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన పరిహార అటవీ (సీఏ) భూములను రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీలను అడ్డుకునేందుకు కొందరు గిరిజన రైతులు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓ గిరిజన రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అధికారులు,స్థానికులు అడ్డుకున్నారు.

108.5 ఎకరాల భూములపై తనిఖీలు

పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 540లో సుమారు 108.5 ఎకరాల అటవీ భూములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూములను కొందరు ఆక్రమించి వందలాది చెట్లను నరికివేసి, భూములను చదును చేసి వ్యవసాయం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర విజిలెన్స్ అధికారి, హైదరాబాద్ డీఎఫ్ఓ సీహెచ్.శివయ్య, హుజూర్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి కె. కిరణ్‌కుమార్, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ జి. మహేష్‌గౌడ్ తదితరులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. భూముల పరిస్థితిని శాటిలైట్ సర్వే ద్వారా కూడా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అటవీ భూముల నక్షలు, పహాణీలు, ఇతర రికార్డులను పరిశీలిస్తూ ఆక్రమణలపై వివరాలు సేకరించినట్లు వెల్లడించారు.

- Advertisement -

సీఏ కింద అటవీ శాఖకు భూముల అప్పగింత

డీఎఫ్‌ఓ శివయ్య తెలిపిన వివరాల ప్రకారం…డెక్కన్ సిమెంట్ యాజమాన్యం అటవీ నష్ట పరిహారం (Compensatory Afforestation–CA) కింద సర్వే నంబర్ 540లోని 108.5 ఎకరాల భూమిని గతంలో అటవీ శాఖకు అప్పగించినట్లు తెలిపారు.ఈ భూముల్లో మంచ్య తండాకు చెందిన కొందరు గిరిజనులు తమకు పట్టాలు ఉన్నాయని పేర్కొంటూ సాగు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు అటవీ భూముల్లో చెట్లను నరికివేసి, భూములను చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చి నాట్లు వేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

అధికారులతో రైతుల వాగ్వాదం

తనిఖీల సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు గిరిజన రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నామని తమ వద్ద పట్టాలు ఉన్నప్పటికీ అటవీ అధికారులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.అయితే ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయని డీఎఫ్‌ఓ శివయ్య స్పష్టం చేశారు. రైతుల వద్ద భూములకు సంబంధించిన పట్టా పుస్తకాలు లేదా ఇతర చట్టబద్ధమైన పత్రాలు ఉంటే జిల్లా కలెక్టర్, అటవీ శాఖ ఉన్నతాధికారులకు సమర్పించాలని సూచించారు. పత్రాలు చట్టబద్ధమైనవిగా విచారణలో తేలితే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

తన భూమి విషయంలో తీవ్ర ఆవేదనకు గురైన మంచ్య తండాకు చెందిన గిరిజన రైతు మాలోత్ మంగ్యా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు, రైతులు వెంటనే అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ సాగు హక్కులను కాపాడాలని వారు కోరారు.

ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవు

అటవీ భూముల్లో అక్రమంగా ప్రవేశించడం,చెట్లను నరికివేయడం,భూములను ఆక్రమించడం అలాగే అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ శివయ్య హెచ్చరించారు.అదేవిధంగా ఈ వ్యవహారంలో కింది స్థాయి అటవీ సిబ్బంది ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలితే వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉన్నతాధికారులకు నివేదిక

క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీలు,శాటిలైట్ సర్వే, అటవీ రికార్డులు, పహాణీలు తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం నివేదికను ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వినయ్‌కుమార్‌కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు.తనిఖీల్లో విజిలెన్స్ బీట్ అధికారులు నరసింహ, సుధాకర్, ఫారెస్ట్ బీట్ అధికారి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News