- హైటెన్షన్ వైర్ల కిందే భవనాలు..
- అనుమతులకు మించి అంతస్తులు
- సెట్‌బ్యాక్‌లకు తూట్లు..
- ప్రమాదకరంగా పరిస్థితులు..
మాదాపూర్ సర్కిల్ పరిధిలోని కొండాపూర్ సైబర్ విలేజ్ హైటెన్షన్ రోడ్డులో హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అత్యంత సమీపంలోనే భారీ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే బిల్డర్ క్యాంపస్ తరహాలో నిర్మాణాలు చేపడుతుండగా, అధికారులు మంజూరు చేసిన అనుమతులు ఒక రకంగా ఉండగా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణాలు మరో రకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండగా, మరోవైపు అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు.

నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా కనీస సెట్‌బ్యాక్‌లు కూడా పాటించకుండా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ మాదాపూర్ సర్కిల్ సిఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్ల సమీపంలో నిర్మాణాలు కొనసాగడం భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, అనుమతులు, వాస్తవ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
