Wednesday, February 25, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంChengicherla | చెంగిచెర్ల భూములపై కబ్జా ముఠా కన్ను..!

Chengicherla | చెంగిచెర్ల భూములపై కబ్జా ముఠా కన్ను..!

  • మాజీ వీఆర్వో కుటుంబసభ్యుల పేరుమీద అక్రమంగా భూముల నమోదు..
  • రంగ శ్రీనివాస్ గౌడ్ చేసిన అక్రమాలపై ఇప్పటికే నమోదైన కేసులు..
  • రికార్డులు కాలిపోవడంతో అక్రమంగా పహానిలో పేర్లు నమోదు చేసుకోవడం..
  • రెవెన్యూ రికార్డులు కాలిపోతే ఆర్డీవో, కలెక్టర్, సీసీఎన్ఏలో రికార్డులు ఏమైనట్టు..?
  • మాజీ వీఆర్వో రంగ రాజారామ్ సర్వీస్ బుక్ రికార్డులో ప్రభుత్వానికి చూపిన భూమి ఎంత?
  • తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలనా కమిషనర్ తన బాధ్యతలు మరిచారా..?

“అక్రమంగా భూ ఆక్రమణలు చేసి, కోట్లు కొల్లగొట్టిన కుటుంబంపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దృష్టిపెట్టి విచారణ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బహిర్గతం అవుతాయి..? “

ఆయనొకప్పుడు వీఆర్వోగా బాధ్యతలు వెలగబెట్టాడు.. భారీ భూ కుంభకోణాలు చేసాడు..! మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? సామాజిక వేత్తలు అడుగుతున్న ప్రశ్నలు ఇవి దానికి సమాధానాలు లేవు.. ఇక భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టే బాధ్యత మరచిపోయారా..? విచిత్రమైన విషయం ఏమిటంటే..

- Advertisement -

ఒకటే ఖాతానెంబర్ 28.. మరి ఈ ఖాతానెంబర్ ను ఒకవైపు మాజీ వీఆర్వో రంగ రాజారాం కుటుంబ సభ్యులు.. మరోవైపు జనగామకు చెందిన బీ.ఆర్.ఎస్. నాయకులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏవిధంగా క్లెయిమ్ చేస్తున్నారు..? రెవెన్యూ చరిత్రలోనే ఇదొక సంచలన వ్యవహారం.. అసలు వీళ్ళిద్దరిమధ్య ఉన్న లింక్ ఏమిటి..? ఏమి జరుగుతోంది..?

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో గల చెంగిచెర్ల గ్రామ శివారులోని విలువైన భూములపై కబ్జా ముఠా కన్నేసిందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో వీఆర్వోగా పనిచేసిన రంగ రాజారాం కుటుంబ సభ్యుల పేర్లపై పెద్ద ఎత్తున భూములు అక్రమంగా నమోదు అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, పహాణీలలో అక్రమంగా పేర్లు నమోదు చేసినట్లు, డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ ద్వారా భూముల కబ్జాకు పాల్పడినట్లు తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో రంగ శ్రీనివాస్ గౌడ్ కీలక పాత్ర పోషించినట్లు విమర్శలు వస్తున్నాయి.. ఇప్పటికే వీరి అక్రమాలపై పలు కేసులు నమోదైనప్పటికీ.. ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది..

రికార్డులు కాలిపోయాయా..? ఇంకేమైనా జరిగిందా..?

అయితే గ్రామ స్థాయి రికార్డులు కాలిపోయినా, ఆర్డీవో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సి.సి.ఎల్.ఏ.) కార్యాలయాల్లో ఉన్న రికార్డులు ఏమైనట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

రంగ రాజారం సర్వీస్ బుక్ రికార్డు ప్రకారం ఉన్న భూమి ఎంత..?

మాజీ వీఆర్వో రంగ రాజారాం సర్వీస్ బుక్ రికార్డుల ప్రకారం ఆయనకు ఉన్న భూమి ఎంత? ఆ వివరాలకు, ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల విస్తీర్ణానికి పొంతన ఏమైనా ఉందా అనే అంశంపై సమగ్ర విచారణ జరగాలన్న డిమాండ్స్ వస్తున్నాయి.. ఇప్పటివరకు వీరిపై, వీరి కుటుంబ సభ్యులపై భూ కబ్జాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి..? అన్న విషయాలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు..

సామాన్య ప్రజలు వారి కష్టార్జితంతో పైసా పైసా కూడా పెట్టుకుని ప్లాట్లు కొనుగోలు చేస్తే వారిని రకరకాల కారణాలచేత ఇబ్బందులు గురిచేస్తున్నారు.. మరి ఇలాంటి వారిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపితే కండ్లు బైర్లు కమ్మే నిజాలు బట్ట బయలు అవుతాయని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు.. వీరి అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్ట లేకపోతుందన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి..

ఖాతా నెంబర్ 28పై డబుల్ క్లెయిమ్..! :

ఖాతా నెంబర్ 28కు సంబంధించి ఒకవైపు రంగ రాజారాం కుటుంబ సభ్యులు, మరోవైపు జనగామ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమకు హక్కు ఉందని క్లెయిమ్ చేయడం రికార్డు ట్యాంపరింగ్ జరిగినట్టు అవుతుంది కదా..? ఈ మాత్రం అవగాహన లేకుండానే రెవెన్యూ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారా..? ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉంటుంది.. కానీ ఇందుకు భిన్నంగా చెంగిచెర్లలో ఒకే ఖాతాపై ఇద్దరికి హక్కులు ఉన్నాయని చెబుతున్నారు అన్న అంశం నేడు కీలకంగా మారింది.

ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు..! :

ఇంత భారీ స్థాయిలో భూ కుంభకోణం బయటపడుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలు ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రంగ రాజారాం కుటుంబ సభ్యుల భూ అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు ఉందా లేదా..? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి..

అయితే మాజీ వీఆర్వో రంగ రాజారాం కుటుంబ సభ్యుల పేర్లు అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకుని కొట్టేసిన భూముల విలువ ఎంత..? ఈ వ్యవహారంపై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ విచారణ జరిపిస్తే కళ్లుచెదిరే విషయాలు వెలుగు చూస్తాయని సామాజికవేత్తలు సూచిస్తున్నారు..

అదే విధంగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.. రంగ రాజారాం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ, ఎంతమంది ప్లాట్లు కబ్జాలు చేశారు..? వీరి బాధితులు ఎంతమంది ఉన్నారు..? వీరిపై ఇప్పటికి ఎన్ని కేసులు ఎక్కడెక్కడ నమోదయ్యాయి..? వీరు రికార్డులను ఏరకంగా ట్యాంపరింగ్ చేసి అధికారులను మేనేజ్ చేస్తున్నారు..? అన్న విషయాలపై మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో వెలుగులోకి తేనుంది

ఆదాబ్ హైదరాబాద్”మా అక్షరం అవినీతిపై అస్త్రం ..

- Advertisement -
RELATED ARTICLES

Latest News