- (కేపీఎస్) పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోందా?
- ఆర్టీఐతో వెలుగులోకి సంచలన విషయం.. విద్యాశాఖ చర్యలపై ఉత్కంఠ
కరీంనగర్ నగరంలో “కోటా పబ్లిక్ స్కూల” వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ స్కూల్‌కు సంబంధించిన వివరాలను కోరుతూ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఇచ్చిన సమాధానం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్టీఐ చట్టం 2005 కింద “కోటా పబ్లిక్ స్కూల” అనుమతులు, నమోదు వివరాలు, విద్యాశాఖ గుర్తింపు వంటి అంశాలపై సమాచారం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, తమ కార్యాలయ రికార్డుల్లో “కోటా పబ్లిక్ స్కూల” అనే పేరుతో ఎటువంటి విద్యాసంస్థ నమోదు కాలేదని అధికారికంగా లేఖ ద్వారా స్పష్టం చేశారు.
దీంతో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం దరఖాస్తును తిరస్కరించారు. అయితే స్థానికంగా వస్తున్న సమాచారం ప్రకారం, నేరుగా “కోటా పబ్లిక్ స్కూల” పేరుతో బోర్డు పెడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి, అదే స్కూల్‌ను (కెపిఎస్) అనే సంక్షిప్త పేరుతో నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేపీఎస్ అంటే “కోటా పబ్లిక్ స్కూల” అనే అర్థం వచ్చేలా తెలివిగా బోర్డు పెట్టి కార్యకలా పాలు కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.విద్యాశాఖ రికార్డుల్లో స్కూల్ పేరు లేకపోయినా, మరో పేరుతో విద్యాసంస్థ నడుస్తుందా? అను మతులు లేకుండానే విద్యార్థులకు బోధన జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఇదే నిజమైతే విద్యా నియమాలను బహి రంగంగా ఉల్లంఘించినట్టేనని విద్యా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వ్యవహారం నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పం దించి కేపీఎస్ పేరుతో నడుస్తున్న స్కూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విచారణ జరపాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే స్కూల్‌కు ఇచ్చిన అనుమతులు, గుర్తింపు పత్రాలు, భవనం అనుమతులు, విద్యార్థుల నమోదు వంటి అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు.
అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నడుస్తున్నట్లు తేలితే, సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, స్కూల్‌ను మూసివేయడం, బాధ్యులపై కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, విచారణ చేపడతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నగరంలో విద్యాసంస్థల నిర్వహణపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎంతవరకు ఉందన్న ప్రశ్న కూడా ఈ సంఘటనతో మరోసారి ముందుకు వచ్చింది. ఈ విషయమై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రతినిధి వివరణ కొరకు కోట పబ్లిక్ స్కూల్ చైర్మెన్ అంజిరెడ్డికి కాల్ చేయగా స్పందించలేదు.
