- డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కల్యాణం
- 2026 జనవరి 18 నుంచి 10 (ఆది) వారాలు జాతర
- భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలు కలిసి పనిచేయాలి
- ఆలయ అభివృద్ధికి చేపడుతున్న పనులపై ఆరా
- ఎండోమెంట్ అధికారులకు ఆదేశాలు, సూచనలు..
- కొమురవెల్లి మల్లన్న జాతర, కళ్యాణం పోస్టర్ విడుదల
- జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి సురేఖ
సిద్దిపేట జిల్లా చేర్యాలలోని శ్రీ కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరలను రాష్ట్ర ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పటిష్ట కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ, ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి సురేఖ సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు.. మల్లన్న జాతర, కళ్యాణం పోస్టర్ను మంత్రి సురేఖ రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక (జనగామ) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్స్పల్ సెకట్రరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, జిల్లా పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవో, కొమురవెల్లి ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ఆర్టీసి డిపో మేనేజర్, డీఎంహెచి, డీపీఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఫైర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. గతేడాది కన్నా వైభవోపేతంగా మల్లికార్జున స్వామి వారి కల్యాణం, జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది జాతర, కల్యాణం నిర్వహించిన సమయంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి అవి జరక్కుండా చూడాలని సూచించారు. డిసెంబర్ 14న ఉదయం 10 గంటల 45 నిమిషాలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. 2026 జనవరి 18 నుంచి 10 (ఆది)వారాలపాటు అంటే మార్చి 16 వరకు జాతరను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని పోలీస్, విద్యుత్, వైద్యారోగ్యం, ఆర్టీసీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కల్యాణాన్ని వీక్షించి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రయాణమయ్యేందుకు వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను నిర్దేశించారు.
తిరుగు గతేడాది జరిగిన జాతర, కళ్యాణం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఎండోమెంట్ అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు కల్యాణోత్సవానికి, జాతరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ దిశగా చర్యలు చేపట్టాలని సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్కు మంత్రి సురేఖ సూచించారు. భక్తుల క్యూలైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిఘా, వీవీఐపీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, భక్తులకు దారులు తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంప్, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
జాతర సమయానికి వేసవి కాలం రానుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు తదితర ఏర్పాట్లుచేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సంపూర్ణంగా నిషేధించాలని ఆదేశించారు. మల్లికార్జున స్వామి వారి కల్యాణం, జాతరను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భక్తులకు సాయపడేలా అవసరమైన చోట వాలంటీర్లు, కార్యకర్తల సేవలను వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
స్వామి వారి ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతర జరిగే అన్ని రోజులు సాయంత్రం సమయం కళాబృందాలతో ఒగ్గుకథ వంటి జానపద కళా రూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. కల్యాణోత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా ఉండేలా కార్యాచరణను వెంటనే అమలుపరచాలని అన్నారు. కల్యాణంతోపాటు జాతర జరిగినన్ని రోజుల దేవాలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేయడంతోపాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో – వచ్చే అవకాశం ఉన్నందున వైద్య శాఖ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా గుండె సంబంధ సమస్యలున్న భక్తులు సైతం వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే సీపీఆర్ చేసేందుకు డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని పక్ష్మగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆలయంలో, ఆలయ ఆవరణలో పరిశుభ్రత తప్పనిసరని, అందుకోసం అవసరమైతే పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా తీసుకోవాలని కలెక్టర్కు చెప్పారు.
సురేఖ అక్క మల్లన్న భక్తురాలు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మల్లన్నస్వామి భక్తురాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురేఖ దేవుళ్లపై అత్యంత భక్తి కలిగిన మంత్రి అని చెప్పారు. ఆమె జాతర సమయంలో మల్లన్న పట్నాలు వేసుకుంటూ తన భక్తిని ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. వైద్య సిబ్బందిని చేర్యాలతోపాటు దగ్గరలో ఉన్న ఆసుపత్రుల నుంచి తీసుకొచ్చి జాతర జరిగే రోజుల్లో భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
జాతర వారాలు
18-01-2026 తొలి ఆదివారం
25-01-2026 రెండో ఆదివారం
01-02-2026 మూడో ఆదివారం
08-02-2026 నాలుగో ఆదివారం
15-02-2026 ఐదో ఆదివారం (ఈ రోజు మహాశివరాత్రి కూడా)
22-02-2026 ఆరో ఆదివారం
01-03-2026 ఏడో ఆదివారం
08-03-2026 ఎనిమిదో ఆదివారం
15-03-2026 తొమ్మిదో ఆదివారం

