150 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో..
వివేక వర్ధిని కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం
పాల్గొని ప్రసంగించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వందేమాతరం(Vande mataram) గీతం 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని వివేక వర్ధిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి(Union Minister) కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం అనే నినాదం.. రెండు పదాల కలయిక మాత్రమే కాదని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం అందించేందుకు పెద్దలు పడిన తపన, తాపత్రయం, నిస్వార్థ త్యాగం, భరతజాతి ఆత్మగౌరవానికి(Self Respect) వందేమాతరం ప్రతీక అని తెలిపారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో దేశభక్తి భావనను పెంపొందించడంలో వందేమాతరం ఒక ప్రేరణాత్మక రణనినాదంగా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
‘వందేమాతరం.. దేశాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్న స్ఫూర్తి మంత్రం. ప్రధాని మోదీ(PM Modi) సంకల్పించిన వికసిత్ భారత్(Viksit Bharat) నిర్మాణ దిశలోనూ వందేమాతరం కొత్త శక్తిని మనకు అందిస్తుంది. సుమారు 150 ఏళ్ల కిందట మహాకవి బంకించంద్ర చటర్జీ(Bankim Chandra Chatterjee) భరతమాత ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా వందేమాతరం పదాన్ని సృష్టించారు. బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు విధానంతో దేశాన్ని చీల్చాలని చూసినప్పుడు వందేమాతరం గీతం భారతీయులను ఏకం చేసింది.

కులం, మతం, ప్రాంతం అనే భేదాల్ని మరిచిపోయి దేశమే ప్రథమం. మిగిలినవన్నీ తర్వాతే అనే భావనను పెంచింది. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసింది. 1905 బెంగాల్ విభజన ఉద్యమం నుంచి 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రతి పోరాటంలోనూ వందేమాతరం గర్జన మార్మోగింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చివరి శ్వాస విడిచే క్షణంలో కూడా పలికిన నినాదం వందేమాతరం. ఇది ఒక పాట కాదు. ఇది ఒక త్యాగ స్ఫూర్తి. ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వందేమాతరం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ ఈ ఒక్క పదంలో దేశభక్తి, ఐక్యత, త్యాగం అన్నీ దాగి ఉన్నాయని చెప్పారు.
దురదృష్టవశాత్తూ కొన్ని సందర్భాల్లో ఈ పవిత్ర గీతాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేసే ప్రయత్నాలు జరిగాయి. వందేమాతరం అనేది ఓ పార్టీ నినాదం కాదు. దేశ సమైక్యతను ప్రతిబింబించే స్ఫూర్తివంతమైన గేయం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత మన గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడేలా చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కి మనం ఎప్పటికీ రుణ పడి ఉంటాం. నాటి హైదరాబాద్ సంస్థానంలో 1938లో వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. దీనిపై నిజాం ప్రభుత్వం వెంటనే నిషేధం విధించింది.
ఓ వైపు వందేమాతరం ఉద్యమాన్ని అణచివేస్తూనే వందేమాతర గీతం ఆలపించినవారిని కళాశాలు, యూనివర్సిటీల నుంచి బహిష్కరించింది. వారి పట్ల కఠినంగా వ్యవహరించింది. వందేమాతరం నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావు ఇంటిపేరు వందేమాతరం అయింది. ఇలా ఎందరో మహానుభావులు వందేమాతరం స్ఫూర్తితో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో త్యాగాలు చేశారు. హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థులతో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో ఎన్నో సంఘాలు కలిసొచ్చాయి.
విభిన్న భావజాలాలు కలిగిన అనేక సంఘాలు తమ రాజకీయ భావజాలాన్ని పక్కనపెట్టిమరీ ఐక్య పోరాటాన్ని ప్రారంభించాయి. ఇంతటి ఘనమైన వందేమాతరం చరిత్రను మనమంతా తెలుసుకోవాలి. దాని నుంచి స్ఫూర్తి పొందాలి. అందుకే ఈ రోజు మనం అందరం వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలి’ అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
