- పశ్చిమాసియా సంక్షోభంపై విపక్షాలది బాధ్యతారాహిత్యం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి దేశంలో కృత్రిమ ఇంధన కొరత సృష్టించేందుకు విపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట నాయకత్వంలో దేశ ఇంధన భద్రత సురక్షితంగా ఉందని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పక్కా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ‘ఫ్రాజైల్-5’ (బలహీన ఆర్థిక స్థితి) కి దిగజారిందని మంత్రి విమర్శించారు. “నాడు ఇంధన పొదుపు పేరుతో రాత్రి 8 గంటల తర్వాత పెట్రోల్ బంకులు మూసివేయాలని ఉచిత సలహాలు ఇచ్చిన వారే, నేడు బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహించేలా భయభ్రాంతులు సృష్టిస్తున్నారని అన్నారు. 2012-13లో ఇరాన్‌పై ఆంక్షల వల్ల ముడిచమురు దిగుమతులు 26.5 శాతం పడిపోయినా, యూపీఏ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా చేతులెత్తేసిందని కానీ మోదీ ప్రభుత్వం అలా కాదు” అని ఆయన మండిపడ్డారు.
సంక్షోభ సమయంలోనూ దేశంలోని 140 కోట్ల మందికి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కిషన్‌రెడ్డి వివరించారు. గతంలో 27 దేశాలపైనే ఆధారపడిన మనం, నేడు 40 దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, మంగళూరు, పదూర్ ప్రాంతాల్లోని భూగర్భ కేంద్రాల్లో దాదాపు 74 రోజులకు సరిపడా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు (Strategic Petroleum Reserves) సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. వివిధ దేశాల ముడి చమురును శుద్ధి చేసేలా రిఫైనరీలను ఆధునికీకరించి, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా, 5వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ అవతరించిందని తెలిపారు.
గల్ఫ్ దేశాల్లోని 90 లక్షల మంది భారతీయుల భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. వాణిజ్య నౌకలపై దాడులను ఉపేక్షించేది లేదని, ‘జీరో టోలరెన్స్’తో ముందుకెళ్తున్నామని తెలిపారు.
హోర్ముజ్ జలసంధిని భారత్ కోసం తెరిచే ఉంచుతామని, భారత జెండా ఉన్న నౌకలను ఆపబోమని ఇరాన్ స్పష్టం చేయడం మోదీ ప్రభుత్వ దౌత్య విజయానికి నిదర్శనమన్నారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ (LPG) సరఫరాలో అంతరాయం కలగకుండా రిఫైనరీలు అదనంగా 25 శాతం ఉత్పత్తిని పెంచాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ఆ భారాన్ని రైతులపై పడనీయలేదని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రైతులకు సకాలంలో ఎరువులు అందేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన హామీ ఇచ్చారు. అవకాశవాద శక్తుల కుట్రలను తిప్పికొట్టి, ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు.
