2026 జనవరి 1 నుంచి ప్రతిష్టాత్మక కింబర్లీ ప్రాసెస్(Kimberley Process-KP) చైర్‌పర్సన్(Chairpersonship)గా ఇండియా(India) బాధ్యతలు స్వీకరించనుంది. చైర్‌పర్సన్ పదవికి ఇండియాను KP ప్లీనరీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ(Ministry of Commerce and Industry) గురువారం తెలిపింది. మన దేశం 2025 డిసెంబర్ 25 నుంచి కింబర్లీ ప్రాసెస్ వైస్ చైర్‌గా బాధ్యతలు తీసుకుంటోంది. కొత్త సంవత్సరంలో అధికారికంగా చైర్‌ను స్వీకరిస్తుంది. ఈ ప్రపంచ చొరవకు నాయకత్వం వహించే బాధ్యతను ఇండియాకి అప్పగించడం ఇది మూడోసారి.
కింబర్లీ ప్రక్రియ అనేది ప్రభుత్వాలు(Governments), అంతర్జాతీయ వజ్రాల పరిశ్రమ(International Diamond Industry), పౌర సమాజం(Civil Society)తో కూడిన త్రైపాక్షిక యంత్రాంగం(Tripartite Mechanism). సాయుధ పోరాటాలకు ఆర్థిక సహాయం చేయడానికి తిరుగుబాటు గ్రూపులు ఉపయోగించే ముడి వజ్రాల వ్యాపారాన్ని నిరోధించడం దీని లక్ష్యం. ఈ నిర్ణయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్వాగతించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సమగ్రత, పారదర్శకత, బాధ్యతాయుత వాణిజ్య పద్ధతుల పట్ల మన నిబద్ధతపై ప్రపంచ నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తున్నట్లు చెప్పారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్‌ను స్థాపించారు. ఇది 2003 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ముడి వజ్రాల వ్యాపారాన్ని అరికట్టడంలో కీలకమైన అంతర్జాతీయ చట్రంగా అభివృద్ధి చెందింది. కింబర్లీ ప్రాసెస్‌లో ప్రస్తుతం 60 మంది భాగస్వాములు ఉన్నారు. యూరోపియన్ యూనియన్‌తోపాటు దాని సభ్య దేశాలను ఒకే భాగస్వామిగా లెక్కిస్తారు. ప్రపంచ ముడి వజ్రాల వ్యాపారంలో ఇది సమిష్టిగా 99 శాతానికి పైగా వాటా కలిగి ఉంది. వజ్రాల తయారీ, వాణిజ్యానికి ప్రపంచంలోని ప్రముఖ కేంద్రాల్లో ఒకటిగా ఇండియా ఎదుగుతున్న తరుణంలో ఈ నాయకత్వం మన చేతికి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
కింబర్లీ ప్రాసెస్‌లో మన దేశం నాయకత్వం వహించనుండటంతో స్థిరమైన, బాధ్యతాయుతమైన సోర్సింగ్‌పై ప్రపంచం దృష్టిపెరుగుతుంది. మన దేశం తన పదవీ కాలంలో పాలన, సమ్మతి విధానాలను బలోపేతం చేయనుంది. డిజిటల్ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీని మెరుగుపరుస్తుంది. డేటా ఆధారిత పర్యవేక్షణ ద్వారా పారదర్శకతను పెంచుతుంది. కాన్‌ఫ్లిక్ట్ డైమండ్లపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. 2025లో వైస్ చైర్, 2026లో చైర్ బాధ్యతలను ఇండియా తీసుకుంటున్న నేపథ్యంలో సర్టిఫికేషన్ పథకంపై విశ్వాసాన్ని బలోపేతం చేయనుంది. నియమాల ఆధారిత సమ్మతిని నిర్ధారించనుంది. కింబర్లీ ప్రక్రియ విశ్వసనీయతను, ప్రభావాన్ని పెంచనుంది. KPలోని అన్ని భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
