- ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్
- సాయంత్రం వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు
- క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం
- షేక్పేట డివిజన్లో పోలీసుల లాఠీఛార్జి
- పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యింది. గత పక్షం రోజులుగా హోరాహోరీ ప్రచారం చేసి, ఓట్లను అర్థించిన ఓటర్లు పెద్దగా స్పందించ లేదు. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
యూసుఫ్గూడ మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్ల విషయంలో నిలదీసిన బీఆర్ఎస్ నేతల పై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే సాయంత్రం 5 గంటల సమయం వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్ దాదాపు 50 శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా షేర్పేట డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. అక్కడ పోలింగ్ బూత్లు 4, 5, 6, 7, 8 వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వాళ్లు హడావిడి చేయడంతో పోలీసులు వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.. కానీ, గులాబీ కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

పలువురు కార్యకర్తలను బూత్ ఏరియాస్ నుంచి చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్తత వెనుక నాన్-లోకల్స్ ఇష్యూ ఉంది.. ఎన్నికల నిబంధనల ప్రకారం నాన్-లోకల్స్ నియోజకవర్గంలో తిరగకూడదు. అయినప్పటికీ, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నాయకులు బూత్ల వద్దకు వచ్చి హడావిడి చేస్తూ ఓటర్లను ఇన్ఫ్లూయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరగడంతో పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేయాల్సి వచ్చింది.
ఒకవైపు ఓటింగ్ పర్సంటేజ్ మందకొడిగా సాగుతుంటే మరోవైపు బస్తీలలో ఓటర్లను డబ్బులతో ఇన్ఫ్లూయెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, డబ్బులు అందకపోవడం వల్ల కూడా ఓటర్లు ఓటింగ్కు రావట్లేదని ఓపెన్గా మాట్లాడుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇదిలావుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై బోరబండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిం చిన వారిపై చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియామవళిని గౌరవించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిం చినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
