రాష్ట్రంలో స్థానిక పోరుపై హైకోర్టు స్టేతో రాజకీయ వేడి కొద్దిగా చల్లబడినా…జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక హీట్ రోజురోజుకు రెట్టింపవుతుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎన్నిక ఇది. ఆ ఎన్నిక ఎంతో దూరం లేదు రేపు విడుదలయ్యే ఎన్నికల నోటిఫికేషన్‌తో ఆ జోష్ ఇంకింత కొనసాగనుంది… కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అక్టోబర్ 13 నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం.
షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్జన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్ ఆర్డిఓ సాయిరాం రిటర్నింగ్ అధికారిగా నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చేనెల 11 ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. పోలింగ్ అనంతరం 14వ తేదీన ఓట్ల కౌంటింగ్ చేయనున్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో ఎన్నిక ఫలితం మాదంటే మాది అనీ రాజకీయ నాయకుల స్పీచ్‌లతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది.
