
ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ బడి పాడి పశువుల వసమైంది. ఉపాధ్యాయుల పట్టింపు లేకపోవడం పాడి రైతులకు వరంగా మారింది. పాఠశాల గేటుకు తాళం వేసివున్నా బలవంతంగా గేటును తన్ని ఆకతాయిలు లోపలికి చొరబడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని జాన్ పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనిపించింది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాఠశాల ప్రాంగణం..
రాత్రి అయితే చాలు మందు బాబులు మద్యం సీసాలతో పాఠశాలలోకి చొరబడి మద్యం సేవించి ఖాళీ సీసాలు, వాటర్ బాటిల్లు, తరగతి గదుల్లో విసురుతూ వీరంగం సృష్టిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో విద్యార్థులు సైతం చెడు వ్యసనాల బారిన పడతారేమోనని విద్యార్థుల తల్లిదండ్రులు లబో-దిబో మంటున్నారు.
సర్కారు బడులపై తల్లిదండ్రుల విముఖత..
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, పాఠశాల నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోరవడడం, పోటీ ప్రపంచానికి అనుగుణంగా సర్కారు బడుల్లో బోధన లేకపోవడం, తదితర కారణాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
విద్యార్థులకు రక్షిత మంచినీరు కరువు..
పాఠశాల విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో స్థానిక డెక్కన్ సిమెంట్ పరిశ్రమ రూ.5 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అదికాస్త నిరుపయోగంగా మార్చడంతో గత్యంతరం లేక పాఠశాల విద్యార్థులు ట్యాప్ వాటర్ తో సరిపెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విధ్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
