ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎల్బీఎం3 – ఎం5 రాకెట్
- సుమారు 4400 కిలోల బరువున్న బాహుబలి ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్వీఎం3
- దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-3 ప్రయోగం విజయవంతం
- నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని కచ్చితత్వంతో ప్రవేశపెట్టిన ఇస్రో
- పదేళ్లపాటు ఇంటర్ నెట్ సేవలందించనున్న ఉపగ్రహం
- పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారైన సీఎంఎస్-3
- భారత్, సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలు అందించనున్న సీఎంఎస్-3..
- బాహుబలి రాకెట్ ద్వారా మరెన్నో శాటిలైట్లని నింగికి పంపే వీలు
- సీఎంఎస్ -3 సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్న ఇస్రో చైర్మెన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో అద్భుత విజయం చేరింది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-03ను మోసుకెళ్లిన ఎల్బీఎం3 -ఎంత్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 16 నిమిషాల 09 సెకన్లలోనే సీఎంఎస్ -3 ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది.

ఈ ప్రయోగం సజావుగా చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషనను విజయవంతం చేసిన ఎల్బీఎం3 రాకెట్ సిరీస్లోనే ఈ ప్రయోగం చేపట్టడం విశేషం. సీఎంఎస్-3 ఉపగ్రహం బరువు సుమారు 4400 కిలోలు, భారత భూభాగం నుంచి జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్లోకి ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. ఈ మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం ద్వారా భారతదేశంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలలో కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగుపరచనున్నారు.
ఈ ప్రయోగం దేశీయ టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ రంగాలకు గొప్ప ఊతాన్ని ఇవ్వనుంది. ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. రాకెట్, ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 26నే దానిని ప్రయోగ వేదికపైకి తరలించారు. ప్రయోగానికి ముందు అన్ని దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి, నిర్దేశిత సమ యంలో రాకెట్ను నింగిలోకి పంపారు. చంద్రయాన్-3 తర్వాత ఎల్బీఎం3 రాకెట్ మరోసారి తన సత్తాను నిరూపించు కోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సీఎంఎస్ –3 సక్సెస్ కావడం ఆనందంగా ఉంది : ఇస్రో చైర్మెన్
‘ఎల్బీఎం 3-ఎం5’ రాకెట్ సీఎంఎస్ -3 శాటిలైట్ ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. ఇది ఎల్ వీఎం సిరీస్ లో 8వ విజయం అని ఆయన తెలిపారు. గతంలో చంద్రయాన్ 3 ప్రయోగంలో ఎల్వీఎం3 రాకెట్ విజయవంతంగా చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండర్, రోవర్ ని దింపిందని గుర్తు చేశారు.
ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన ఇస్రో ఫ్యామిలీ మొత్తానికి అభినందనలు అంటూ, అందరూ ఐకమత్యంగా, లక్ష్యంతో పనిచేశారని వెల్లడించారు. బాహుబలి రాకెట్ ద్వారా మరెన్నో శాటిలైట్లని నింగికి పంపే వీలుందని, మొదటిసారి క్రియోజనిక్ ఇంజన్ లో రీఇగ్నైట్ విజయవంతంగా జరిగిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
