(ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులుకు రంగారెడ్డిలో పోస్టింగ్)
(ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు.. అవినీతి అధికారికి అండదండలు)
- నల్గొండ కలెక్టర్ నివేదికను బుట్టదాఖలు చేసి బాధ్యతలు
- డీఎస్పీ మృతికి కారణమంటూ సంచలన ఆరోపణలు
- ఏడీ శ్రీనివాసులుకు రూ. 70 కోట్లకు పైగా అక్రమాస్తులు…
- కొల్లగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్లు విమర్శలు.
- ఏడీ శ్రీనివాసులపై చర్యలకు ప్రభుత్వ వెనుకడుగు.
ప్రభుత్వ పరిపాలనలో దొర్లిన ఘోరమైన తప్పిదానికి, అవినీతిపరులైన అధికారుల(Corrupt Officials)కు వ్యవస్థీకృతంగా లభిస్తున్న సహాయ సహకారాలకు అద్దం పట్టేలా సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) కె. శ్రీనివాసులు (AD Srinivasulu) ఉదంతం నిలుస్తోంది. నల్గొండ జిల్లా(Nalgonda District)లో పనిచేసినప్పుడు భూ అక్రమాలకు పాల్పడటం, సిబ్బందిని వేధించడం, చివరకు ఒక డీఎస్పీ మృతి(Dsp Death)కి కారణమయ్యారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొని, స్వయంగా జిల్లా కలెక్టర్ చేత “సరెండర్” (Surrender) చేయబడిన అధికారికి… శిక్ష పడకపోగా, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన, రెవెన్యూపరంగా బలమైన రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాన్ని, అవినీతిపరులకు అందుతున్న అండను బట్టబయలు చేస్తోంది.

నల్గొండలో అరాచకం: కలెక్టర్ నివేదిక ఏం చెప్పింది?
నల్గొండ ఏడీగా కె. శ్రీనివాసులు (సుమారు 4 ఏళ్ల 10 నెలలు) పనిచేసిన కాలంలో జరిగిన అక్రమాలపై అప్పటి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy)(10.12.2020న) ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ భూముల తారుమారు:
చింతపల్లి మండలం వుట్కూరు, నల్గొండ మండలం అక్కలాయిగూడెం, మర్రిగూడ మండలం ఇండస్ట్రీ గ్రామాలలో ప్రభుత్వ భూములను పట్టా భూముల్లో కలిపి రికార్డులు తారుమారు చేశారని ఎమ్మెల్యే (Mla) నిర్దిష్టంగా ఆరోపించారు.
డీఎస్పీ మృతికి కారణం:
అక్కలాయిగూడెం భూ రికార్డుల మార్పు విషయంలో ఏడీ శ్రీనివాసులు పెట్టిన మానసిక హింస కారణంగానే డీఎస్పీ శంకరయ్య మరణించారని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో సంచలన ఆరోపణ చేశారు.
సిబ్బందిపై వేధింపులు(Torture):
మునుగోడులో నిజాయితీగా నివేదిక ఇచ్చిన సర్వేయర్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసి వేధించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై స్పందించిన అప్పటి నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్, “నిష్పక్షపాత విచారణ జరిపించేందుకు వీలుగా” మరియు “పరిపాలనా కారణాల దృష్ట్యా” ఏడీ శ్రీనివాసులు సేవలను తక్షణమే (14.12.2020న, లేఖ నెం: ఏ1/ 8984 /2020) సర్వే శాఖ కమిషనర్‌కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పరిపాలనా వైఫల్యం: శిక్షకు బదులు కీలక పోస్టింగ్!
ఒక జిల్లా కలెక్టర్, ఒక శాసనసభ్యుడు తీవ్రమైన ఆరోపణలతో (భూ అక్రమాలు, డీఎస్పీ మృతికి కారణం) ఒక అధికారిపై నివేదిక ఇచ్చి, విచారణ కోసం పైకి పంపితే.. సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఇక్కడే ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. నల్గొండ కలెక్టర్ నివేదికను, అందులోని ఆరోపణల తీవ్రతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. “ఒక అవినీతి అధికారికి మరో అవినీతి అధికారి తోడవుతాడు” అన్న చందంగా, అప్పటికే రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పూర్తి సహకారంతో, ఏడీ శ్రీనివాసులు ఎలాంటి విచారణను ఎదుర్కోకపోగా, మరింత కీలకమైన రంగారెడ్డి జిల్లాకు ఏడీగా పోస్టింగ్ దక్కించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇది పరిపాలనా పరంగా ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా, ఒక అత్యంత అవినీతిపరునికి ఉన్నత స్థాయిలోనే సహాయ సహకారాలు అందాయని చెప్పడానికి నిదర్శనం.
రూ. 70 కోట్లకు పైగా అక్రమాస్తులు(Illegal Assets)?
“కుక్క తోక వంకర” అన్నట్లు, ప్రభుత్వ అండదండలతో రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన ఏడీ శ్రీనివాసులు, తన అవినీతిని మరింత బరితెగించి కొనసాగించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ కోట్లు కొల్లగొట్టిన వైనం “ఆదాబ్ హైదరాబాద్” పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి వచ్చింది. రూ. 20 కోట్ల ఫ్లాట్: గచ్చిబౌలిలోని ‘మై హోమ్ భూజ’ అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాసులు భార్య (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) నీరజ పేరు మీద సుమారు రూ. 20 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ (హెచ్.1901) ఉంది. రూ. 50 కోట్ల రైస్ మిల్లు: నారాయణపేట జిల్లా, గూడబల్లూరులో కుమార్తె తన్మయి, మామ కూన రాములు (రిటైర్డ్ ఉద్యోగి) బినామీ పేర్లపై 6 ఎకరాల భూమిలో “వసుధ ఫుడ్స్” పేరుతో సుమారు రూ. 50 కోట్ల విలువైన భారీ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇతర ఆస్తులు: మహబూబ్‌నగర్‌లో సుమారు రూ. 3 కోట్ల విలువైన మూడంతస్తుల భవనం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వానిదే (Government) బాధ్యత?
నల్గొండ కలెక్టర్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, శ్రీనివాసులపై అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యేవి కావు. వందల కోట్ల అక్రమాస్తులు పోగయ్యేవి కావు. ఒక అధికారిపై స్పష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు (ఏ1/ 8984 /2020) వచ్చినప్పుడు, హైదరాబాద్ రంగనాథ్ లాంటి అధికారులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించిన వాటిని విస్మరించి, అతనికి కీలక పోస్టింగ్ ఇవ్వడానికి సహకరించిన ఉన్నతాధికారులపై (ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ మిట్టల్ వంటి) ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నా, బినామీ ఆస్తులు పెరిగిపోతున్నా ఏసీబీ, ఐటీ, బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం కింద ఎందుకు
విచారణ (Enquiry) జరపడం లేదు?
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, కేవలం శ్రీనివాసులపైనే కాకుండా, అతనికి అండగా నిలిచిన, నిలుస్తున్న ప్రభుత్వ పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలని, అక్రమాస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి, అవినీతిపరులకు లభిస్తున్న అండదండలకు నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులపై వచ్చిన ఆరోపణల గురించి ఆదాబ్ హైదరాబాద్ పూర్తి వివరణ కోరుతూ లేఖను పంపింది. కానీ వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు.
