బంజారా హిల్స్‌లో భవనం సీజ్
‘ఆదాబ్ హైదరాబాద్’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన “ముడుపులు ఇచ్చుకో… మూడు అంతస్తులు కట్టుకో” అనే శీర్షికతో వచ్చిన కథనంపై జీహెచ్‌ఎంసీ అధికారులు వేగంగా స్పందించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పత్రిక కథనం ఆధారంగా బంజారా హిల్స్ రోడ్ నెం. 12లోని ఓ అక్రమ భవనంపై చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నిర్ధేశించిన ప్లాన్ల ఉల్లంఘన, అక్రమ నిర్మాణాలను గుర్తించి, జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం ఆ భవనాన్ని సీజ్ చేశారు. ఈ చర్యను బంజారా హిల్స్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తీసుకోవడం గమనార్హం.

కొంతకాలంగా ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకున్న తక్షణ చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా స్పందించి, అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఇలాంటి అక్రమాలకు భవిష్యత్తులో కూడా కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.