Saturday, March 28, 2026
Homeనల్లగొండIllegal | ఇసుకను బ్లాక్ చేసి అమ్మితే కఠిన చర్యలు.. ఏడి.మైన్స్ జాకబ్

Illegal | ఇసుకను బ్లాక్ చేసి అమ్మితే కఠిన చర్యలు.. ఏడి.మైన్స్ జాకబ్

  • అధిక ధరకు విక్రయించినా, కస్టమర్లను ఇబ్బంది పెట్టినా జైలుకు పంపుతాం…
  • బ్రోకర్లు/దళారీల వ్యవస్థను ఉపేక్షించేది లేదు…
  • కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు..ఎస్పీ శరత్ చంద్ర పవార్…
  • ట్రాక్టర్ డ్రైవర్లకు మైనింగ్, పోలీస్ అధికారుల స్పష్టమైన హెచ్చరిక…

నల్గొండ టౌన్: ​ఇసుక బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇసుకను సక్రమంగా, నిర్ణీత ధరకు సరఫరా చేయకుండా, అడ్డంగా బ్లాక్ చేసి అధిక ధరకు బ్రోకర్లకు విక్రయిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల తీరుపై జిల్లా అధికారులు కన్నెర్ర చేశారు. ఈ తరహా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మైనింగ్, పోలీస్ అధికారులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి, ఆదేశాల మేరకు, మంగళవారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో మైనింగ్, వన్ టౌన్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు సంయుక్తంగా ఇసుక ట్రాక్టర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు..

ఇసుకను అధిక ధరకు అమ్మితే కేసులు, జైలు శిక్షే..

- Advertisement -

​ఈ సందర్భంగా ఎడి మైన్స్ జిల్లా అధికారి శ్రీ జాకబ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయించిన నిర్ణీత ధరకే ఇసుకను సరఫరా చేయాలి..ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే, వారు చెల్లించిన ధరకు సరఫరా చేయాలి.’ఇసుక బాలేదు’, ‘దూరం ఎక్కువ’ వంటి మాయమాటలు చెప్పి కస్టమర్ల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తే, కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.. కస్టమర్లకు కాకుండా, అధిక డబ్బులు వస్తాయని ఆశపడి బ్రోకర్లకు ఇసుకను విక్రయిస్తే.. బ్రోకర్లపై, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. బుక్ చేసిన అడ్రస్కు కేటాయించిన వెంటనే ఎక్కడా ఆపకుండా డెలివరీ చేయాలి. రోడ్లపై ట్రాక్టర్లను ఆపి, ట్రాఫిక్ జామ్‌కు, చుట్టుపక్కల కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.

​దళారీ వ్యవస్థకు చెక్…

ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఎవరైనా బ్రోకర్లకు సరఫరా చేస్తున్న సమాచారం సేకరించి వారిపై కేసులు నమోదు చేస్తామని, మధ్యలో ఉండి ఈ దళారీ వ్యవస్థను నడిపించే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మైన్స్ అధికారి జాకబ్ తెలిపారు. తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు..

డాక్యుమెంట్లు, నంబర్ ప్లేట్లు తప్పనిసరి.. ట్రాఫిక్ సీఐ..​

ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు ఉండాలి. వాహనం ముందు, వెనుక నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి ఎవరైనా అతివేగంతో, అజాగ్రత్తతో వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇసుక బుక్ చేసుకున్న కస్టమర్లు ఎవరైనా డ్రైవర్ల వల్ల ఇబ్బందులకు గురైతే, వెంటనే మైనింగ్ శాఖకు గానీ, పోలీసులకు గానీ పిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఇసుక బుక్ చేసి బ్లాక్ చేస్తున్న బ్రోకర్లు/దళారీల సమాచారం ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, మైనింగ్ శాఖ అధికారులు మరియు ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News