75 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్లు ఎందుకు..?
- భయాన్ని బలహీనపరుస్తున్నారు
- పదేపదే రాయితీలు ఇవ్వడమేంటి?
- ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుంది
- ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్లపై హైకోర్టు ఆగ్రహం
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం ఈ మధ్య వాహనాల రకాన్ని బట్టి.. 75 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. పేరుకుపోయిన పెండిరగ్ చలాన్ల బకాయిలను రికవరీ చేసుకునేందుకు.. ప్రభుత్వం అప్పుడప్పుడు డిస్కాంట్లు ఇస్తుంటుంది. ఇలా డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చట్టపరమైన పరిణామాల పట్ల ప్రజల్లో ఉన్న భయం, గౌరవం బలహీనపడతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా.. రాయితీలు ట్రాఫిక్ క్రమశిక్షణారాహిత్యాన్ని మరింత పెంచుతాయని, ప్రజలు నిబంధనలను ఉల్లంఘించినా ఏదో ఒక దశలో రాయితీ లభిస్తుందనే భావన పెరిగే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
ఈ-చలానా వ్యవస్థలో మార్పులు చేసి, ఉల్లంఘన వివరాలను స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా వ్యవస్థను సవాల్ చేస్తూ హైదరాబాద్ తార్నాకకు చెందిన వి. రాఘవేంద్రచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ట్రిపుల్ రైడిరగ్‌కు 1988 మోటారు వాహనాల చట్టం సెక్షన్ 128 రెడ్‌విత్ 177 ప్రకారం.. రూ. 100 నుంచి రూ. 300 మాత్రమే జరిమానా విధించాలి. కానీ దీనికి విరుద్ధంగా 2019 నిబంధన ప్రకారం.. రూ. 1000 విధిస్తున్నారని.. ఇది చెల్లదని వాదించారు. 2019లో సవరణ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోకపోవడంతో..
1988 నిబంధనల ప్రకారమే చలానా జారీచేయాల్సి ఉందన్నారు ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె తమ వాదనలు వినిపించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 200 కింద ట్రాఫిక్ ఉల్లంఘనలనేవి జరిమానా విధించదగ్గ నేరాలని తెలిపారు. అందుకు సంబంధించిన జరిమానాల వివరాలను వెల్లడిస్తూ ప్రభుత్వం 2007 జీవో 54 జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం జరిమానాను పెంచుతూ 2011లో ఉత్తర్వులు జారీ చేసిందని.. ప్రస్తుత చలానా వ్యవస్థలో నిబంధనలన్నీ పొందుపర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఉల్లంఘనగా పరిగణించబడిరదనే వివరాలను చలానా జారీ సమయంలో స్పష్టంగా పొందుపరచగలిగే వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలు, వ్యవస్థ అభివృద్ధి ఏ దశలో ఉందో సమగ్ర నివేదికను డిసెంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు హోంశాఖను ఆదేశించింది. ఈ సాంకేతిక మెరుగుదల కేంద్ర మోటారు వాహన నిబంధన 167 ప్రకారం తప్పనిసరి అని న్యాయమూర్తి గుర్తు చేశారు.
