తెలుగు సినిమా హీరోయిన్ (Telugu Cinema Heroine) నిధి అగర్వాల్‌కు అసౌకర్యం కలిగించిన మాల్(Mall) యాజమాన్యంపై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకులను కూడా బుక్ చేశారు. ముందుగా అనుమతి తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించినందుకు చర్యలు చేపట్టారు. హీరో ప్రభాస్ (Hero Prabhas) నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా పాట విడుదల తర్వాత నటి నిధి అగర్వాల్ చుట్టూ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారని, దానివల్ల ఆమె చాలా ఇబ్బందికి గురయ్యారని ఆరోపణలు వచ్చినట్లు కేపీహెచ్‌బీ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో జరిగింది. నిధి అగర్వాల్.. మాల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్తుండగా ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా రావడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు ప్రయత్నించారు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో నిధి అగర్వాల్ బాధగా కనిపించారు. తర్వాత భద్రతా సిబ్బంది అతి కష్టమ్మీద ఆమెను కారు వద్దకు తీసుకెళ్లారు.
