కడ్తాల్ కస్తూర్భా స్కూల్ నిర్వహణ భేష్
తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు మహిళల కళాశాలను తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు డా.చారకొండ వెంకటేష్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, హాస్టల్ భవనాలు, ల్యాబ్, లైబ్రరీ తదితర విభాగాలను పరిశీలించి చాలా సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ, శుభ్రత గురించి కొనియాడారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యా ప్రగతి, వసతి మరియు ఆహార సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతని స్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతూ ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యతోపాటు మంచి భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం కలుగుతోందని అన్నారు.
ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బోధన విధానాలు, హాజరు,పాఠ్య ప్రణాళిక అమలు, విద్యార్థుల వ్యక్తిగత దృష్టి మరియు నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. ఉపాధ్యాయుల కృషి మరియు నిబద్ధతను ప్రశంసిస్తూ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించే విధంగా బోధన కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా విద్యా ర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ల్యాబ్ల ఆధునీకరణ, లైబ్రరీ విస్తరణ, క్రీడా వనరులు, స్వచ్ఛత మరియు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలను కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని, విద్యా రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్,ఎస్ అనిత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
