రామగుండం(Ramagundam)లో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం (Power Station) నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు 2024 సెప్టెంబర్‌లో ప్రతిపాదనలు పంపగా డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) ఇచ్చాక 2025 సెప్టెంబర్‌లో బోర్డు ఆమోద ముద్ర వేసింది. బోర్డుతోపాటు దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్లు ఓకే అన్నాయి. మంత్రివర్గం (Cabinet) పచ్చజెండా ఊపటమే మిగిలింది. నిధులు తదితర అంశాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది.
ఈ ప్రాజెక్టుకు రూ.10,893.05 కోట్లు అవసరమని అంచనా వేశారు. పనులను 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క మెగా వాట్ నిర్మాణానికి రూ.13.62 కోట్లు ఖర్చవుతాయని లెక్కలేశారు. ఏడాదికి 3.005 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమని భావిస్తున్నారు. నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు 17,612 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉంది. 2030 నాటికి పవర్ డిమాండ్ 25,639 మెగావాట్లకు చేరుకుంటుందని అనుకుంటున్నారు. ఈ గిరాకీని తీర్చేందుకు రామగుండంలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి ప్రణాళిక రచించారు.
