- ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు 26 వేల జీతం పెంచాలి.
- ఏఐటీయూసీ బ్రాంచ్ నేతలు గంధం శ్రీను, నరసింహ..
తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెడికల్ కళాశాలలు, వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆసుపత్రులు, సిహెచ్ సి కేంద్రాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బ్రాంచ్ కార్యదర్శి గంధం శీను, సీనియర్ నేత నరసింహ డిమాండ్ చేశారు.
గడువు ముగిసిన పాత టెండర్ ఏజెన్సీలను రద్దుచేసి తక్షణమే నూతన టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని, కార్మికులకు జాతీయ పండగ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మంగళవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కార్మికులు విధులు బహిష్కరించి ఒక గంట పాటు ఆస్పత్రి ఎదుట నిరసన ధర్నా చేపట్టారు.

అలాగే వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల గేట్ ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను, నరసింహలు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులో పారిశుద్ధ్యం భద్రత, రోగి సంరక్షణ కోసం ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల వ్యవధితో టెండర్ విధానాన్ని అమలు చేస్తుందని అయితే గత ప్రభుత్వం 2022 లో టెండర్ నోటిఫికేషన్ లో ఎంపికైన ఏజెన్సీల మూడు సంవత్సరాల కాలపరిమితి ముగిసి కూడా దాదాపు ఏడు నెలలుగా గడుస్తున్నదని అన్నారు. ప్రభుత్వం నూతన టెండర్లు పిలవకుండా పాత ఏజెన్సీలకే పొడిగించడం చేత కార్మికులపై తీవ్రమైన ఆర్థిక నష్టం తో పాటు పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త టెండర్ల కోసం ఇప్పటికే అనేక పర్యాయాలు వైద్యశాఖ ఉన్నత అధికారులను, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విన్నవించడం జరిగిందని అన్నారు. 2012 సంవత్సరం నుండి ఇప్పటివరకు కనీస వేతన జీవోలు సవరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచే విధంగా కొత్త జీవోను తక్షణమే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ ఆసుపత్రులలో సంవత్సరాల తరబడి థర్డ్ పార్టీ కాంట్రాక్టు వర్కర్స్ గా ఉద్యోగ భద్రత లేకుండా రాష్ట్రంలో వేలాదిమంది పనిచేస్తున్నారని అన్నారు. గత టెండర్ నోటిఫికేషన్లో ఏజెన్సీ కాంట్రాక్టర్లకు అనుకూలమైన అంశాలు ఉండడం చేత కార్మికులు సక్రమమైన జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులకు నోచుకోలేకపోయారని అన్నారు.
నూతన టెండర్ గైడ్లైన్స్ లో కార్మికుల సంక్షేమం ప్రత్యేకంగా పొందుపరిచి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వైద్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి వేతనాల పెంపుపై స్పష్టత ఇవ్వాలని లేనిచో ఈనెల ఐదో తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో దర్గా స్వామి, నరేందర్, కుమార్, శివ, షాబాద్, రవి కిషోర్, వెంకటయ్య, శ్రీకాంత్, కళావతి ఇందిరా, గోవిందమ్మ మహేశ్వరి, శ్వేత, దేవమ్మ, సింధూజా, మెడికల్ కళాశాల కార్మికులు కుమార్, మన్నేమ్మ, పీరమ్మ, రాజేశ్వరి, బొజ్జమ్మ, గోవిందమ్మ, సుజాత, శారద, సైదా బేగం, లావణ్య, ఈశ్వరమ్మ, శ్రీదేవి,జయలక్ష్మి, శివ లీల, లత, అంజలి తదితరులు పాల్గొన్నారు.
