- సోషల్ మీడియా ప్రభావంలో చిక్కుకోకండి..
ముక్కు ముఖం తెలియని వ్యక్తులు నమ్మి నిత్యం చాలా మంది యువతులు, యువకులు మోసాల బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నా వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో తల్లిదండ్రులను కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలను సైతం వదిలేసి ఎదుటి వ్యక్తి ట్రాప్ లో పడిపోతున్నారు.
తాజాగా విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్ చదివే యువతకి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయమైన కొన్ని నెలలకే అతని ట్రాప్ లో పడిన యువతి అతని మాటలు నమ్మి ఏకంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇంట్లో పరీక్షకు వెళుతున్నానని చెప్పి వచ్చిన యువతి నేరుగా విశాఖలో బస్సు ఎక్కి కావలిలో దిగింది.
అయితే ఎంతసేపటికి ప్రేమించిన యువకుడు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆ యువతి కావలి పోలీసుల దృష్టిలో పడింది. దీంతో ఆ యువతిని స్టేషన్ తీసుకు వచ్చిన పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. తనకు ఇంస్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయం అయ్యాడని ఆ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు విశాఖ నుంచి కావలికి వచ్చినట్లు చెప్పడంతో ఆశ్చర్యపోయారు పోలీసులు.. ఇంస్టాగ్రామ్ లో పరిచయంతో జీవితం నాశనం చేసుకోవద్దని ఆయువతికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
