రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా మరోసారి పడగ విప్పింది. ప్రభుత్వ నిబంధనలను, చట్టాలను కాలరాస్తూ బడా సంస్థలు సాగిస్తున్న అరాచకాలకు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి తోడవ్వడంతో నగరం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో, బేగంపేట నడిబొడ్డున ‘నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్’ (Navayuga Engineering Company Limited)సాగిస్తున్న అతిపెద్ద అక్రమ నిర్మాణం(Illegal construction) వెలుగులోకి వచ్చింది. అనుమతులు పొందిన స్థలాన్ని వదిలేసి, పక్కనే ఉన్న వేలాది గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నా, అధికారులు కళ్ళు మూసుకోవడం వెనుక లక్షలాది రూపాయల లంచాలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం, బేగంపేటలోని సర్వే నంబర్ 103/1, 103/2లో 12,600 గజాల స్థలంలో 4 సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 12 అంతస్థుల నిర్మాణానికి నవయుగ సంస్థ 2022లో (పర్మిట్ నెం: 2500/జీహెచ్‌ఎంసీ/సికింద్రాబాద్/2022 – బీపీ) అనుమతి పొందింది. అయితే, నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న సర్వే నంబర్ 182లోని సుమారు 6000 గజాల ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించి చేపడుతోంది.
ఈ అక్రమంపై రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాలతో బాలానగర్ తహసిల్దార్ క్షేత్రస్థాయి విచారణ జరిపారు. మండల సర్వేయర్, గిర్దావర్‌తో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఈ విచారణలో నవయుగ సంస్థ సర్వే నంబర్ 103తో పాటు, సర్వే నంబర్ 182లోని భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టంగా తేలింది.
ఈ మేరకు తహసిల్దార్, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఒక సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ నివేదిక అంది నెలలు గడుస్తున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి అవినీతికి, నవయుగ సంస్థతో కుమ్మక్కైన తీరుకు నిలువుటద్దం పడుతోంది.
అక్రమం జరిగిందని ప్రభుత్వ రెవెన్యూ అధికారి నివేదిక ఇచ్చినా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? హెచ్‌ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేసి, అనుమతులు రద్దు చేయాల్సిన అధికారులు, అక్రమార్కులకు కొమ్ముకాయడం దేనికి సంకేతం? లక్షలాది రూపాయల లంచాలు తీసుకొని, తహసిల్దార్ నివేదికను చెత్తబుట్టలో పడేశారన్న విమర్శలకు అధికారులు సమాధానం చెప్పాలి. ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక రాజకీయ అండదండలు కూడా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయికి చేరిందనడానికి బేగంపేటలోని నవయుగ అక్రమ నిర్మాణ వ్యవహారమే ఒక పచ్చి ఉదాహరణ. ఇక్కడ అక్రమాన్ని అరికట్టమని ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదునే కొందరు అవినీతి అధికారులు “బేరర్ చెక్కు”గా మార్చుకొని లబ్ధి పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదుదారుడికి న్యాయం చేయడం పక్కనపెట్టి, ఆ ఫిర్యాదును అడ్డం పెట్టుకొని అక్రమార్కుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్న అధికారుల తీరుతో జీహెచ్‌ఎంసీ పరువు గంగలో కలుస్తోంది.
నవయుగ సంస్థ ప్రభుత్వ రికార్డులను, రెవెన్యూ నివేదికను సైతం ధిక్కరించి, వేరొక సర్వే నంబర్‌లో నిర్మాణం చేపడుతుంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదు? ఒక ఐఏఎస్ అధికారిగా, నగర ప్రథమ పౌరుడి తర్వాత అత్యున్నత స్థాయిలో ఉన్న ఆయన, ఇంత పెద్ద అక్రమంపై కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తహసిల్దార్ వంటి బాధ్యతాయుతమైన అధికారి ఇచ్చిన నివేదికకు విలువ లేనప్పుడు, ఇక సామాన్యుడి ఫిర్యాదుకు విలువెక్కడిది?
కమిషనర్ గారి మౌనం, కింది స్థాయి అధికారులకు వరంగా మారింది. “మాపైనున్న వాళ్లే పట్టించుకోనప్పుడు, మనకెందుకు” అనే ధోరణితో రెచ్చిపోతున్నారు. ఈ అక్రమంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినవారి ఫిర్యాదు పత్రం, టౌన్ ప్లానింగ్ అధికారుల చేతిలో అక్రమార్కులను బెదిరించి డబ్బులు గుంజే ఆయుధంగా మారిందని, అది ఒక “బేరర్ చెక్కు”లా పనిచేసిందని బాధితులు వాపోతున్నారు. అంటే, ఆ ఫిర్యాదును చూపించి, దానిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లక్షల రూపాయలు లంచం రూపంలో అధికారులు తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం.
ఒక ఐఏఎస్ అధికారి సారథ్యంలోని విభాగంలో, సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడిన ఒక అక్రమంపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడుతున్నారంటే, అది ఆయన పదవికే కళంకం తెచ్చే విషయం. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి, తహసిల్దార్ నివేదిక ఆధారంగా నవయుగ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, సంబంధిత అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, ప్రజల్లో అధికార వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో, ఈ అవినీతి సామ్రాజ్యానికి ఆయనే మకుటం లేని మహారాజుగా చరిత్రలో నిలిచిపోతారు.



